Wednesday, January 22, 2025

ఇజ్రాయెల్ అధినేత తెంపరితనం

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా గాడితప్పాయి. సుమారు ఏడాదిగా గాజా ప్రాంతంపై యుద్ధం కొనసాగిస్తూ, ఆ ప్రాంతాన్ని స్మశానంగా మార్చివేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాపై దాడుల నెపంతో లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. హమాస్‌కు మద్దతుగా తమ దేశ ఉత్తర భూభాగంపై అడపాదడపా దాడులు కొనసాగిస్తూ జననష్టం కలిగిస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థను తుదముట్టించేందుకు పదిహేను రోజుల కిందట పేజర్, వాకీటాకీలతో దాడులు జరిపిన ఇజ్రాయెల్, తాజాగా దాడులు తీవ్రతరం చేసింది. మూడు రోజుల కిందట బాంబుల వర్షం కురిపించి, హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చింది. ఆ మరునాడే మరోసారి దాడి జరిపి కీలక నేత నబిల్ కౌక్‌ను మట్టుబెట్టింది. ఉగ్రవాద నేతలను హతమార్చే క్రమంలో ఇజ్రాయెల్ బీరుట్, సైదా, మరజుయాన్, టైర్, జహరాని తదితర నగరాల్లో అపారమైన ఆస్తి, ప్రాణనష్టాలకు పాల్పడింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది.

గత రెండు వారాలుగా లెబనాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో వెయ్యిమంది వరకూ మరణించినట్లు అంచనా. ఇక గత ఏడాది కాలంగా గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకూ అసువులు బాసినవారి సంఖ్య 41 వేలకు పైమాటే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుద్ధకాంక్ష మితిమీరుతోందని, పశ్చిమాసియా అగ్నిగుండంలా మారడానికి ఆయన అనుసరిస్తున్న విధానాలే కారణమని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన నెతన్యాహూ, అక్కడి నుంచే నస్రల్లా హత్యకు తమ దళాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆయన తెంపరితనానికి నిదర్శనం. ఈ దారుణ హింసకు ఇకనైనా స్వస్తి పలకాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చి పట్టుమని పదిరోజులు కాకముందే ఇజ్రాయెల్ మరొకసారి పెనుదాడులను పాల్పడటం ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది.

హమాస్ -ఇజ్రాయెల్ మధ్య పోరు మొదలైనప్పటి నుంచీ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు కొమ్ము కాస్తూ వస్తున్న అమెరికా, తాజాగా బీరుట్‌పై దాడులనూ వెనకేసుకువచ్చింది. అంతేకాకుండా, ఒకవైపు ఇజ్రాయెల్ వైమానిక సేన హెజ్బొల్లా దళాలపై విరుచుకుపడుతుంటే, సిరియాలో ఉన్న అమెరికా దళాలు వైమానిక దాడులు నిర్వహించి, 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించుకున్నాయి. హెజ్బొల్లా- ఇజ్రాయెల్ శత్రుత్వం ఈనాటిది కాదు. నలభైయ్యేళ్ల క్రితం పురుడుపోసుకున్న హెజ్బొల్లా.. ఇరాన్ అండదండలతో బలోపేతమై, ఇజ్రాయెల్‌కు కంట్లో నలుసులా మారింది. మాదక ద్రవ్యాల రవాణాలో కీలక పాత్ర నెరపుతూ ఆర్థికంగానూ నిలదొక్కుకుని, రెండు లక్షలకు పైగా రాకెట్లను సమకూర్చుకుంది. ఆరంభంలో లెబనాన్‌కు మాత్రమే పరిమితమైన హెజ్బొల్లా తదనంతర కాలంలో తన కార్యకలాపాలను అనేక దేశాలకు విస్తరించింది.

దక్షిణ అమెరికాలోని పలు దేశాలు హెజ్బొల్లాకు ఆర్థిక చేయూతను అందిస్తున్న విషయం గమనార్హం. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో కీలక నేతలను కోల్పోయిన హెజ్బొల్లా తనకు వెన్నుదన్నుగా ఉన్న షాడో యూనిట్లను రంగంలోకి దించనున్నట్లు వినవస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యూనిట్లు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నాయి. హైకమాండ్ నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఆయా దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హతమార్చడం వీటి పని. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారడంతో దాని ప్రభావం చమురు మార్కెట్లపైనా పడింది. నస్రల్లా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఆ దేశం నేరుగా యుద్ధంలోకి దిగితే చమురు సరఫరా సమస్యాత్మకంగా మారే ప్రమాదం ఉంది.

హమాస్, హెజ్బొల్లా, హూతీలపై ముప్పేట దాడి చేస్తున్న ఇజ్రాయెల్‌ను కట్టడి చేసేందుకు చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయాలనే యోచనలో ఇరాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చమురు ధరలు ఆకాశాన్నంటడం ఖాయం. ఇప్పటికే నస్రల్లా హత్యానంతరం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పీపా ధర 72 డాలర్లు దాటేసింది. ఈ ధరల పెరుగుదల అక్కడితో ఆగబోదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో లెబనాన్‌ను మరో గాజాలా మార్చకముందే నెతన్యాహును అదుపు చేసేందుకు ప్రపంచ దేశాల నేతలంతా ఒక్కతాటిపైకి రావలసిన అవసరం ఉంది. లేదంటే ఈ మారణహోమం ఇంతటితో ఆగదన్నమాటే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News