Sunday, December 22, 2024

గాజాపై భూతల మెరుపు దాడులు

- Advertisement -
- Advertisement -

రఫా: గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఆ దిశగా మెల్లగా అడుగులు వేస్తోంది. ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై బుధవారం అర్ధరాత్రి స్వల్ప స్థాయిలో భూతల దాడులు చేసింది. హమాస్‌కు చెందిన మొత్తం 250 స్థావరాలపై యుద్ధ ట్యాంకులతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం( ఐడిఎఫ్) తెలిపింది. మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లు సొరంగాలు, రాకెట్ లాంచర్లే లక్షంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. గాజాలో ఇంధన నిల్వలు నిండుకున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యాలు గాజాపై భూతల దాడులకు దిగడం ఇది రెండో సారి. గాజాలోని మిలిటరీస్థావరాలే లక్షంగా ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అత్యధిక జనసాంద్రత కలిగిన గాజాలో పౌర నివాసాలనుంచే హమాస్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఐడిఎఫ్ ఆరోపిస్తోంది.

నివాసాల మధ్యే రాకెట్ లాంచర్లు ఉన్నట్లు పేర్కొంది.ఈ క్రమంలోనే మిలిటెంట్ల మౌలిక సదుపాయాలు,యాంటీ ట్యాంక్ క్షిపణిప్రయోగ స్థావరాలపై దాడులు చేశామని తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఇరువైపులా ప్రాణనష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. అయితే ఇజ్రాయెల్ కనీవినీ ఎరుగని రీతిలో కురిపిస్తున్న బాంబుల వర్షం కారణంగా గాజా ప్రాంతంలో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితులోల ఇజ్రాయెల్ గనుక హమాస్‌ను తుదముట్టించే లక్షంతో భూతల దాడులను కొనసాగించిన పక్షంలో ప్రాణ నష్టం ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపన దాడుల కారణంగా 750 మందికి పైగానే చనిపోయారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ సంఖ్య ధ్రువీకరణ కాలేదు. పైగా చనిపోయిన వారిలో పౌరులు ఎంతమంది, మిలిటెంట్లు ఎంతమంది అనే విషయం కూడా తెలియరాలేదు.

దాడి చేసిన అనంతరం తమ యుద్ధ ట్యాంకులు క్షేమంగా తిరిగి వచ్చాయని ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు. తదుపరి యుద్ధ దశలకు సన్నాహకంగా ఈ దాడి జరిపినట్లు ఆయన తెలిపారు.ఈ దాడుల్లో ఇజ్రాయెల వైపు ఎవరూ చనిపోలేదని కూడా ఆయన చెప్పారు. మరో వైపు గాజాపై స్వల్పస్థాయి భూతల దాడులకు ఉపక్రమించే సమయంలోనే దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంలోని ఓ నివాస భవనంపై గగనతల దాడి జరిగింది. ఇజ్రాయెల్ వాయుసేన ఈ దాడి జరిపింది. ఈ భవనంలో 75 మంది నివాసముంటున్నట్లు సమాచారం. కాగా ఈ దాడిలో పలువురు గాయపడగా వారినందరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎంతమంది చనిపోయారో మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతి దాడుల్లో ఇప్పటివరకు 6,500 పాస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అల్‌జజీరా జర్నలిస్టు కుటుంబం మృతి
ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో అమాయకులైన పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఖతర్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ ‘అల్ జజీరా’ గాజా బ్యూరో చీఫ్ వాయెల్ దాహ్‌దౌ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు వైమానిక దాడుల్లో మృతి చెందినట్లు ఆ చానెల్ వెల్లడించింది. అల్ జజీరా సంసలో దాహ్‌దౌ ప్రముఖ పాత్రికేయుడు. గాజాలో సాయుధ ఘరణను ఆయన కవర్ చేస్తున్నారు. తనకు జరిగిన నష్టంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పెద్ద సంఖ్యలో ప్రజల ఇళ్లపై బాంబుల వర్షం కురుస్తోంది.మహిళలు, పిల్లలపై జరుగుతున్న ఈ విషాదం ఏ విపత్తుకన్నా తక్కువ కాదు’ అని అన్నారు. అల్ అక్సా ఆస్పత్రిలో మృతి చెందిన తన వారి కోసం ఆయన కుమిలిపోతున్న దృశ్యాలను అల్‌జజీరా ప్రసారం చేసింది.

ఆయన కుటుంబానికి చెందిన మరి కొందరు ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ సైన్యం ఈ మరణాలను ధ్రువీకరించలేదు. మరో వైపు అత్యవసర మందుల కొరతతో ఆస్పత్రులు అల్లాడిపోతున్నాయి. క్షతగాత్రులకు కనీసం మత్తు మందు ఇవ్వకుండానే ఆపరేషన్లు నిర్వహించాల్సి వస్తోందని డాక్టర్లు వాపోతున్నారు. ముఖ్యమైన వైద్య సరఫరాలతో కూడిన ఎనిమిది ట్రక్కులను గాజాలోకి తీసుకు రావడానికి తాము ప్రయత్నిస్తున్నామని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థ అధికారులు తెలిపారు.అత్యవసర వైద్య పరికరాలను తీసుకువచ్చే ట్రక్కులకు ఇంధనాన్ని సైతం ఆ సంస్థే అందజేస్తూ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News