Thursday, November 14, 2024

చర్చలు ముందుకు సాగేనా?

- Advertisement -
- Advertisement -

తమ కమాండర్ ఫవాద్ షుక్‌న్రు గత నెలలో పథకం ప్రకారం అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన హెజ్బొల్లా, అన్నంత పనీ చేసింది. అయితే ఈ విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ వర్గాలు ముందే పసిగట్టడంతో హెజ్బొల్లా దాడి ప్రారంభించడానికి అరగంట ముందే లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ప్రతిగా హెజ్బొల్లా వందలాది రాకెట్లు, డ్రోన్లతో దాడి చేసింది. ఆదివారం తెల్లవారుజామున మొదలైన ఈ యుద్ధం పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇరువైపులా దాడులు కొన్ని గంటల వ్యవధిలోనే సద్దుమణగడం విశేషం.

కాగా ఈ దాడులు ఆరంభం మాత్రమేనని హెజ్బొల్లా ప్రకటించగా, ఈ పరిమిత దాడిలో విజయం తమదంటే తమదేనని ఇరుపక్షాలూ ప్రకటించుకోవడం విశేషం. ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్ లో హెజ్బొల్లా కమాండర్ షుక్‌న్రు, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ కొన్ని రోజుల వ్యవధిలో పథకం ప్రకారం అంతమొందించింది. దీంతో ఇరాన్, దాని మద్దతుతో లెబనాన్‌లో వేళ్లూనుకున్న ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా, గాజాలో ఇప్పటికే ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హమాస్ భగ్గుమన్నాయి. తమ నేతల హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్‌తో పాటు రెండు ఉగ్రవాద సంస్థలూ ప్రతినబూనిన నేపథ్యంలో ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధంగానే ఉంది. అధునాతన ఆయుధ సంపత్తితో, క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించే పటిష్ఠమైన ఐరన్ డోమ్ వ్యవస్థతో శక్తిమంతమైన ఇజ్రాయెల్ తాజా దాడిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందనే చెప్పాలి.

హెజ్బొల్లా ఉపయోగించిన కాలం చెల్లిన రష్యన్ తయారీ కత్యూష రాకెట్లు ఆశించిన స్థాయిలో విధ్వంసం సృష్టించలేకపోయాయి. అయినప్పటికీ హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచీ ఆ దేశ ఉత్తర ప్రాంతంలో హెజ్బొల్లా సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. హెజ్బొల్లా దాడులకు వెరచి 60 వేల మంది ఇజ్రాయెలీలు గత పది నెలలుగా తాత్కాలిక శిబిరాల్లో మగ్గుతున్నారు. ఉత్తర సరిహద్దుల్లో హెజ్బొల్లా ఆట కట్టించాలంటూ ఇజ్రాయెల్ మంత్రివర్గంలోని ఒక వర్గం ప్రధాని నెతన్యాహుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. అయితే అది అంత తేలికైన విషయం కాదన్న సంగతి వారికి తెలియనిది కాదు. గాజాలో యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ అంగీకరిస్తే, తాము కూడా దాడులకు స్వస్తి పలుకుతామని హెజ్బొల్లా స్పష్టం చేస్తోంది. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధాన్ని అటు ఇజ్రాయెల్ గానీ, ఇటు ఇరాన్ గానీ కోరుకోవడం లేదు. హమాస్ అగ్రనేత హనియేను ఇజ్రాయెల్ ఏజెంట్లు తమ దేశంలోకి చొరబడి మరీ అంతమొందించినా ఇరాన్ ఇంతవరకూ ప్రతీకారానికి దిగకపోవడానికి కారణం అదే. అమెరికా, ఇజ్రాయెల్ కలసికట్టుగా దాడి చేస్తే, ఎదుర్కోవడం కష్టసాధ్యమనే విషయం ఇరాన్ అగ్రనేతలు గ్రహించారు. కాబట్టే తాము తెరచాటున ఉండి, హెజ్బొల్లాను ఎగదోస్తున్నారు.

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి తెర దించేందుకు ఈజిప్టు రాజధాని కైరోలో ఒకవైపు చర్చలు జరుగుతుండగానే హెజ్బొల్లా- ఇజ్రాయెల్ మధ్య దాడులు మొదలుకావడం ఒకింత ఆందోళన కలిగించే పరిణామం. ఇప్పటికే మధ్యవర్తులు విధించిన కొన్ని షరతులకు అంగీకరించిన ఇజ్రాయెల్, తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం గాజాలో జనసాంద్రత గల ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకునేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే, ఈజిప్టు- గాజా సరిహద్దుల నుంచి వైదొలగేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన పిమ్మట ఇరుపక్షాల అధీనంలో ఉన్న బందీల విడుదలకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.

హమాస్ వంద మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకోగా, ఇజ్రాయెల్ జైళ్లలో వెయ్యి మందికి పైగా పాలస్తీనావాసులు మగ్గుతున్నారు. వీరి విడుదల కోసం మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, అమెరికా, ఖతార్ దేశాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు. కాల్పుల విరమణకు సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చించేందుకు మొన్న సమావేశమైన ప్రతినిధులు చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో ఆశించిన ఫలితం వెలువడవచ్చని భావిస్తున్న సందర్భంలో తాజా దాడులు చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News