ముందు వెనకలు ఆలోచించకుండా, తన దుందుడుకు విధానాలతో పదవి చేపట్టిన రెండు నెలల్లోనే వీలైనంత అప్రదిష్ఠ మూటగట్టుకున్న అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, తాజాగా అన్నంత పనీ చేశారు. హమాస్ చెరలో మిగిలి ఉన్న బందీలను విడుదల చేయకపోతే గాజాను సర్వనాశనం చేస్తానన్న పెద్దమనిషి, ఇజ్రాయెల్‌కు పచ్చజెండా ఊపడం, ఆ వెనువెంటనే గాజాపై బాంబుల దాడి మొదలు కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ భీకరదాడుల్లో 400 మందికి పైగా కన్నుమూయగా, వీరిలో చిన్నారులే అధిక సంఖ్యలో ఉన్నట్లు, మరో వెయ్యి మందికిపైగా గాయపడినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ చెబుతున్నా, సాధారణ ప్రజలే భారీ సంఖ్యలో బలైనట్లుగా తెలుస్తోంది. జనావాసాలు, శరణార్థి శిబిరాలు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాఠశాలలపై ఇజ్రాయెల్ విమానాలు బాంబులతో విరుచుకుపడినట్లు విదేశీ వార్తా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
పైపెచ్చు ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ తమతో సంప్రదించిన పిమ్మటే దాడులకు ఉపక్రమించారని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించడం సిగ్గుచేటు. అమెరికాను భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదన్న శ్వేతసౌధం పెద్దలకు ప్రజాస్వామిక విధానాలపై ఏమాత్రం నమ్మకం లేనట్లుగా తాజా సంఘటనను బట్టి విశదమవుతోంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య జనవరి 19న కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఆరు వారాలపాటు సాగే ఒప్పందం మొదటి దశలో భాగంగా హమాస్ తన చెరలో ఉన్న బందీల్లో 33 మందిని విడచిపెడితే, తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీల్లో రెండువేల మందిని ఇజ్రాయెల్ విముక్తుల్ని చేయాలి. మొదటి దశ ముగిసి రెండో దశ అమలుకోసం చర్చలు మొదలు కావలసిన తరుణంలో కథ అడ్డం తిరిగింది. ఒప్పందం కొనసాగించాలంటే హమాస్ చెరలో ఉన్న బందీలలో సగంమందిని విడచిపెట్టాలని, రంజాన్ నేపథ్యంలో తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకూ కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ విట్కాఫ్ అనూహ్యంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడంతో చర్చలకు ప్రతిష్టంభన ఏర్పడింది.
కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరాక, అది అమలు జరుగుతున్న తరుణంలో ఇలా కొత్తగా షరతులు విధించడమేమిటని ప్రశ్నించే ధైర్యం ఒప్పందానికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ దేశాల ప్రతినిధులకు లేకపోయింది. అమెరికా ప్రతిపాదించిన అడ్డగోలు షరతులకు హమాస్ ససేమిరా అనడంతో ఇజ్రాయెల్ మరోసారి తన క్రూర స్వభావాన్ని బయటపెట్టుకుంది. యుద్ధం కారణంగా కకావికలమై, ప్రాణభయంతో చెట్టుకొకరు, పుట్టకొకరు చందంగా వెళ్లిపోయిన గాజావాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న తరుణంలో వారికి బయటనుంచి వస్తున్న సహాయం అందకుండా అడ్డుకట్ట వేసింది. రంజాన్ మాసంలో కూలిన భవంతుల తాలూకు శిథిలాల మధ్యే రోడ్డుపై గాజావాసులు ఇఫ్తార్ విందును ఆరగిస్తున్న దృశ్యాలు ఎంతటి పాషాణ హృదయాలనైనా కరగిస్తాయి. కానీ, అధికారం నిలుపుకునేందుకు యుద్ధాన్ని ఆయుధంగా చేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు, ఇజ్రాయెల్‌కు ఆయుధ సంపత్తిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న అగ్రరాజ్యానికీ మాత్రం ఇవేవీ పట్టడం లేదు. మొండివాడు రాజుకంటే బలవంతుడనేది సామెత. రాజే మొండివాడైతే ఇక చెప్పేదేముంది? డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అదే.
ఆయనకు ఎవరి సలహాలూ అక్కర్లేదు, ఎవరి మాటనూ పట్టించుకోరు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లనే రీతిలో మొండిగా వ్యవహరిస్తూ, ఇతర దేశాలతో కోరి శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటున్నారు. సుంకాల పేరిట మెక్సికో, కొలంబియా, ఇండియాలను బెదిరించి లొంగదీసుకునేందుకు ఒకవైపు కుటిల యత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు, పనామా కాలువను వశం చేసుకుంటాం, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం, గాజావాసులను ఆఫ్రికా దేశాలకు పంపి, గాజాను భూతలస్వర్గంగా మారుస్తామంటూ అర్థపర్థంలేని వ్యాఖ్యలు చేస్తూ, ప్రపంచ దేశాలలో ఇప్పటికే వీలైనంత చెడ్డపేరు మూటగట్టుకున్న ట్రంప్ మహాశయుడు గాజా విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని భావించడం అత్యాశే అవుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా దొరికిన సమయాన్ని హమాస్ ఆయుధ సమీకరణకు ఉపయోగించుకుంటోందని తెలియడం తో దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ చెబుతున్నా, కాల్పుల విరమణకు సంబంధించి తాజా షరతులకు అంగీకరించేలా హమాస్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పన్నిన వ్యూహంలో భాగమే తాజా దాడులని అర్థమవుతోంది. కానీ, తమ వ్యూహానికి అమాయక ప్రజలు, ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారనే ఇంగిత జ్ఞానం వారికి కొరవడటమే అత్యంత బాధాకరమైన విషయం.