ఉధృతమైన మారణహోమంగా 2024 సంవత్సరం చరిత్రలో నిలిచిపోయినా కానీ, కొన్ని ధనిక, అత్యంత శక్తివంతమైన సంస్థలు మాత్రం ఈ మారణహోమం సాధారణమైనదే అన్న భావనతో ఉంటున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమానికి పాశ్చాత్య ప్రభుత్వాలు నివారించే ప్రయత్నాలు చేపట్టడం లేదు. ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయెల్ రణజ్వాలలతో చలికాచుకుంటోంది. ప్రధాన స్రవంతి మీడియా సైతం గాజాలోని ఇజ్రాయెల్ మారణహోమాన్ని ప్రేక్షకునిలా చూస్తోంది. మొత్తం మీద ఏ దేశమూ ఇజ్రాయెల్‌కు యుద్ధ విరమణకు పిలుపు ఇవ్వకుండా వెనుకంజ వేస్తున్నాయి. 14 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపలేకుంటున్నాయి.
ఆక్రమిత పాలస్తీనా భూభాగం వెస్ట్‌బ్యాంక్ నుంచి అణచివేతలను అడ్డుకోలేకుంటున్నాయి. అలాగే ఎలాంటి హెచ్చరికలు లేకుండా లెబనాన్‌లో సాగుతున్న దాడులను నిలువరించలేకుంటున్నాయి. ఈ 14 నెలల్లోనే 45,000 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులే ఉండడం గమనార్హం. ఈ దారుణాలపై ప్రపంచ దేశాలు మౌనం పాటించడం బాధ్యతారాహిత్యమైన సంక్లిష్టతే కాదు ఎంతో నష్టదాయకం. దీనికి తోడు మరో వాస్తవ విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులకు కావలసిన ఆయుధాలు సరఫరా చేస్తున్నది అమెరికాయే. ఇటీవల యెమెన్ నుంచి వచ్చిన హోతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోవడానికి మొట్టమొదటిసారి థాడ్ (టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) అనే బ్రహ్మాస్త్రాన్ని ఇజ్రాయెల్ ప్రయోగించింది. థాడ్ భారీ క్షిపణి వ్యవస్థను రూపొందించింది అమెరికాయే.
దీన్ని బట్టి ఇజ్రాయెల్ మారణహోమానికి పరోక్షంగా అమెరికా ఏ విధంగా సహకరిస్తోందో తెలుస్తుంది. ఈ మారణహోమం రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బీభత్సకాండను గుర్తుకు తెస్తోందని శాంతికాముకులు ఆక్షేపిస్తున్నారు. పాలస్తీనాకు ప్రత్యేక పాత్రికేయులుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్‌కెస్సా అల్బనీస్ ఇజ్రాయెల్ హత్యలకు కచ్చితమైన పదం మారణహోమమేనని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రోయెసెస్, ఆయన బృందం యెమెన్‌లోని సనా విమానాశ్రయం వద్ద ఉండగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరగడం అత్యంత దారుణం.దాడుల నుంచి కొన్ని మీటర్ల దూరంలోనే తప్పించుకుని వీరు బయటపడడం మానవతా వాదులందరికీ ఆందోళన కలిగించింది. యెమెన్‌లోని సనా విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకోవడం వల్లనే ఈ సంఘటన జరిగింది.
ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న దానికి ఉదాహరణ ఇది మొదటిసారి కాదు, సెప్టెంబరులో ఇజ్రాయెల్ అక్రమంగా ఆక్రమించుకున్న తన ఆక్రమిత ప్రాంతాల నుంచి తక్షణం వైదొలగాలన్న ఐక్యరాజ్య సమితి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినా ఫలితం కనిపించలేదు. ప్రపంచ సమస్యల పరిష్కారంలో ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించని నిరుత్సాహపరిచే నిష్క్రియకు ఇది మరో తార్కాణంగా నిలిచిపోయింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెతన్యాహుపై అవినీతి ఆరోపణలు కోర్టు వరకు అతన్ని దోషిగా తీసుకువచ్చినా ఆ దేశ శాసన వ్యవస్థ నుంచి ఆయనకు కొంత మినహాయింపు కనిపిస్తోంది. నెతన్యాహుపై అవినీతి, మోసం, నమ్మకద్రోహం వంటి కేసులు ఉన్నా అతడ్ని ఏమీ చేయలేకపోతున్నాయి. తనపై అవినీతి ఆరోపణలు అర్థరహితమని, తాను నిబద్ధతగల నాయకుడినని, ఇజ్రాయెల్ ప్రయోజనాల రక్షకుడినని నెతన్యాహు తన వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు.
ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించే క్రమంలో ఇలాంటి ఆరోపణలు చేయడమంటే సముద్రంలో నీటి చుక్కను వేయడమేనని వ్యాఖ్యానించారు. భద్రతా కారణాల దృష్టా రహస్య బంకర్‌లో ఆయన ఇటీవల విచారణకు హాజరయ్యారు. కీలకమైన యుద్ధ సమయంలో ప్రధానిగా బాధ్యతలను నిర్వహిస్తూనే విధిగా కోర్టుకు హాజరయ్యానని తన సాహసాన్ని మరోసారి చెప్పుకున్నారు. ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం దోషిగా తేలినా ప్రధాని రాజీనామా చేయవలసిన అవసరం లేదు. గాజాలో ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని నివారించాలంటూ భారత్ కూడా పలుమార్లు పిలుపునిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పాలస్తీనియన్ల సంక్షేమం కోసం 2.5 మిలియన్ డాలర్ల (రూ. 20.83 కోట్లు) సాయం విడుదల చేసింది. పాలస్తీనా శరణార్థుల కోసం పని చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్లుఎ)కు భారత్ విరాళం అందజేసింది. యుఎన్‌ఆర్‌డబ్లుఎకు వార్షికంగా 5 మిలియన్ డాలర్ల సాయం అందజేస్తామని భారత్ 2018లోనే హామీ ఇచ్చింది.
ఇందులో భాగంగానే 2023 24 సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా 2.5 మిలియన్ డాలర్లను అందజేసింది. విద్య, వైద్యం వంటి వాటికి ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ నిధులను వెచ్చించనుందని వెస్ట్‌బ్యాంక్ రామల్లాలోని భారత ప్రతినిధి తెలిపారు. పాలస్తీనాకు సహాయం అందించే అలాంటి ఐరాస సంస్థను వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ తీర్మానించడం గర్హనీయం. పాలస్తీనా రాజ్యస్థాపనకు ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మారణహోమాన్ని నివారించడానికి చొరవ తీసుకోకుంటే మరింత అధ్వాన పరిస్థితులు ఏర్పడి మానవత్వమన్నది అసలు చిరునామా లేకుండాపోతుంది. 2024 అత్యంత విషాద ఘట్టంగా గడిచిపోయింది. ఇప్పుడీ కొత్త సంవత్సరంలోనైనా ఇజ్రాయెల్ వంటి రణపిపాస దేశాలకు తగిన ప్రాయశ్చితం కలగాలని మేధావులు కాంక్షిస్తున్నారు.