Monday, December 23, 2024

పశ్చిమాసియా మంటలు

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియా, పెనం మీది నుంచి పొయ్యిలో పడుతున్నది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను ఆపడానికి సిద్ధంగాలేని దాని అధినేత నెతన్యాహు విస్తృత ప్రాంతీయ యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాడనే అభిప్రాయం కలుగుతున్నది. స్వదేశంలో తన తప్పులు ఎప్పటికీ బోనెక్కకుండా చూసుకోడానికి ఆయన యుద్ధాగ్నులకు ఆజ్యంపోస్తున్నాడన్న విమర్శ వినవస్తున్నది. మంగళ, బుధవారాల్లో సంభవించిన రెండు ఘటనలు ఈ ప్రాంతాన్ని అగ్నిపర్వతంమీద కూచోబెట్టాయి. గాజాలో ఇజ్రాయెల్‌తో తలపడుతున్న హమాస్ ముఖ్య నాయకుడు సాలేహ్ అరౌరిని బీరూట్‌లో హతమార్చిన ఘటన తీవ్ర ప్రతీకారానికి దారి తీసే ప్రమాదమున్నది. అరౌరి హత్య ఊరకే పోదని లెబనాన్‌లోని బలమైన తీవ్రవాద సంస్థ హెజ్ బొల్లా ప్రతిజ్ఞ చేసింది. హెజ్ బొల్లాకు చెందిన కొంత మంది మిలిటెంట్లను కూడా బీరూట్‌లో హతమార్చారు. హెజ్ బొల్లాకు ఇరాన్ అండదండలున్నాయి. అది బీరూట్ దక్షిణ శివార్లను అదుపు చేస్తున్నది. ఇరాన్‌లో బుధవారం నాడు జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 84 మంది మృతి చెందిన ఘటన పశ్చిమాసియాను మరింత ఉద్రిక్తం చేసింది.

నాలుగేళ్ళ క్రితం డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉండగా అమెరికా హతమార్చిన అతి ముఖ్యుడైన ఇరాన్ సైనిక నేత కాసీం సోలీమాన్ సమాధి వద్ద నివాళులర్పించడానికి హాజరైన జనం మధ్యలో పేలిన బాంబులు దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ బాంబులు ఇటీవలి కాలంలో ఇరాన్ ఎరుగని బీభత్సాన్ని సృష్టించాయి. ఈ దాడులు ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 820 కిలోమీటర్ల దూరంలోని కెర్మన్‌లో సంభవించాయి. ఇందులో 280 మంది గాయపడ్డారు. 195 మంది ఆసుపత్రి పాలయ్యారు. అందుచేత మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సోలేమన్ ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ దళాల అధిపతి. ఆయన ఇరాక్‌లో ఉండగా ట్రంప్ ఆదేశాల మీద డ్రోన్ దాడితో హతమార్చారు. ఆయనకు నివాళులు అర్పించే సందర్భాన్ని శత్రువులు జీర్ణించుకోలేకపోయారని, వారిని వదిలిపెట్టబోమని ఇరాన్ అధినేతలు ప్రకటించారు. లెబనాన్ రాజధానిలో హమాస్ అగ్రనేత అల్ అరౌరిని హతమార్చిన మరుసటి రోజే కెర్మన్ బాంబు దాడులు సంభవించడం గమనించవలసిన విషయం. ఇరాన్‌ను, హెజ్ బొల్లాను రెచ్చగొట్టి ముగ్గులోకి లాగే పన్నాగం కనిపిస్తున్నది. ఇంకొక వైపు ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్లు వాణిజ్య నౌకలపై అదే పనిగా దాడులు చేస్తున్నారు.

వారి అంతు చూడాలని అమెరికా నిర్ణయించుకొన్నట్టు అర్ధమవుతున్నది. యెమెన్‌లో అతి కష్టం మీద కుదిరిన శాంతికి విఘాతం కలిగించరాదనే దృష్టితో ఇంత కాలం ఆగామని, ఇక వూరుకోబోమని, హౌతీలు తాము స్వాధీనం చేసుకొన్న వాణిజ్య నౌకలను తక్షణమే విడుదల చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. ఇరాన్‌లో జంట బాంబు పేలుళ్ళు సంభవించిన కొద్ది సేపట్లోనే హౌతి మిలిటెంట్లకు అమెరికా, దాని 12 మిత్ర దేశాలు రాత హెచ్చరికను విడుదల చేశాయి. ఇరాన్ కూడా తన నౌకలను రంగంలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. అయితే అమెరికతో యుద్ధానికి దిగడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ మూడు మాసాలుగా సాగిస్తున్న దాడులు పోలిక లేని అమానుషత్వాన్ని నిరూపించుకొంటున్నాయి. అక్కడ ఇప్పటికి 22 వేల మంది మరణించారు. అప్పుడే కన్ను తెరిచిన వేలాది మంది బాలలను మృత్యువు ఆరగించింది. ఈ అమానవీయతను ఇజ్రాయెల్ ఇంకా కొనసాగిస్తున్నది. అమెరికా దన్ను దానికి పూర్తిగా వున్నది. దానితో ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోతున్నది. లెబనాన్‌లో హమాస్ అగ్రనేతను ఇజ్రాయెలే చంపించింది. ఆ విధంగా అది ఇరాన్‌ను, హెజ్ బుల్లాను కూడా రెచ్చగొట్టింది. అయినా ఇజ్రాయెల్‌కు అమెరికా పగ్గాలు వేయడం లేదు.

ఈ పరిస్థితి ప్రపంచానికి ఊహించని ఉపద్రవాన్ని దాపురింపజేస్తుంది. పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధమే చోటు చేసుకొంటే ప్రపంచానికి కీలక సరఫరాలన్నీ బందయిపోతాయి. అందుచేత ముందుగా గాజాలో ఇజ్రాయెల్ దాడులకు తెర దించాలి. ఈ ఏడాదిలో గల అధ్యక్ష ఎన్నికలలో గెలుపు కోసం బైడెన్ పన్నుతున్న వ్యూహంలో భాగంగా పశ్చిమాసియా ఇలా మండుతూ పోతుందా? ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమల్లోకి తెచ్చిన నిరంకుశ న్యాయ సంస్కరణలు ప్రజాకోర్టులోనూ, న్యాయ స్థానం లోనూ వీగిపోయాయి. కేవలం ఆయన స్వార్థం కోసం ఈ అంతర్జాతీయ అమానుషం ఇలా కొనసాగుతుంటే అంత కంటే అన్యాయం ఏముంటుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News