Sunday, November 17, 2024

రఫాపై ధ్వంస రచన

- Advertisement -
- Advertisement -

అనుకున్నంతా అయ్యింది. గాజా నగరాన్ని సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సేనలు రఫా నగరంపై ధ్వంస రచన ప్రారంభించాయి. అమాయకుల ప్రాణాలు హరిస్తూ, ఆసుపత్రులను కూలుస్తూ, భవంతులను నేలమట్టం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఇజ్రాయెల్‌కు ముకుతాడు వేసేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. హమాస్ చెరలో ఉన్న తమ బందీలను విడిపించుకోవడానికి సామదానభేదోపాయాలు ఉండగా, వాటిని కాదని దండోపాయమొక్కటే మార్గమంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు కరాఖండిగా చెప్పడాన్ని చూసి మానవతావాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. రాబో యే రోజుల్లో దాడులు మరింత ఉధృతం చేస్తామని, హమాస్ మెడలు వంచాలంటే ఇదొక్కటే మార్గమని ఆయన నిస్సిగ్గుగా చెబుతున్నారు.

గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమయ్యాక దాదాపు సగం మంది రఫా నగరానికి వలసపోయారు. గాజాస్ట్రిప్ కు దక్షిణాన ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ నగర జనాభా 23 లక్షలు. ఇందులో సగం మంది ఇజ్రాయెల్ దాడులకు భీతిల్లి, గాజానుంచి వలస వచ్చినవారే. వలస జనాభాతో కిటకిటలాడుతున్న రఫాపై దాడులు చేయొద్దని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. రఫాపై శనివారం నాటి రాత్రి జరిగిన బాంబుల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చిన్నారులు బలైపోయారు. అదే రోజు మరొక సంఘటనలో బాంబు పేలుడు ధాటికి ఓ నిండు గర్భిణి కన్నుమూసింది. అయితే ఆమె గర్భంలోని చిన్నారిని వైద్యులు కాపాడగలిగారు.

ఏడో నెలలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్- హమాస్ యుద్ధకాండలో 34 వేల మంది పాలస్తీనియన్లు అసువులు బాశారు. ఇంత మంది అమాయకులు బలైపోతున్నా ఇజ్రాయెల్ యుద్ధకాంక్ష రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఒకవైపు హమాస్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఇరాన్ తోనూ కయ్యానికి కాలుదువ్వుతోంది. డమాస్కస్ లోని తమ కార్యాలయంపై జరిగిన దాడులకు ఇజ్రాయెల్ కారణమంటూ ఈనెల రెండో వారంలో ఆ దేశంపైకి ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడికి దిగింది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులకు పాల్పడింది. ఈ సంఘటనలతో ఇంతవరకూ ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలా ఉన్న పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. దరిమిలా క్రమేణా పశ్చిమాసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేయడంలో అమెరికా నామమాత్రపు పాత్ర పోషించడాన్ని మానవతావాదులు, హక్కుల సంఘాలు తప్పుపడుతున్నాయి. ఆరేడు దశాబ్దాలుగా అమెరికా- ఇజ్రాయెల్ స్నేహబంధం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. పశ్చిమాసియాలో అమెరికా నుంచి అధిక మొత్తంలో ఆర్థిక, సైనిక సహాయాన్ని పొందుతున్న దేశం ఇజ్రాయెల్ మాత్రమే.

హమాస్‌ను తుదముట్టించే నెపంతో అమాయక జనం ప్రాణాలను ఇజ్రాయెల్ హరిస్తున్నా అమెరికా మొసలి కన్నీరు కారుస్తోందే తప్ప యుద్ధ విరమణ కోసం కార్యాచరణకు దిగింది లేదు. పైపెచ్చు, రఫాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన రోజునే 26 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసి, మిత్రదేశంపట్ల తమ ఉదారతను చాటుకుంది. ఇందులో యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజా కు మానవతా సహాయం కింద కంటితుడుపుగా 9 బిలియన్ డాలర్లను కేటాయించడం గమనార్హం. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఏడు దశాబ్దాలుగా రగులుతున్న వివాదం ఒక్క రోజులో ముగిసేది కాదు. గతంలో కుదిరిన శాంతి ఒప్పందాలు సైతం చెల్లుబాటు కాని నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పరిష్కార మార్గాన్ని కనుగొనడం అసాధ్యమే. అయితే మరింత మంది అమాయకులు బలి కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగానైనా ఓ పరిష్కారాన్ని కనుగొనడం ప్రపంచ దేశాల బాధ్యత.

గాజాలో యుద్ధ విరమణ కోసం ఖతార్, ఈజిప్టు వంటి దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ మిత్రదేశాల నుంచి సహకారం అందడం లేదు. రంజాన్ మాసం మొదలు కావడానికి ముందే తాత్కాలిక యుద్ధ విరమణకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో తమ చర్చలకు సహకారం అందించాలంటూ ఖతార్ ప్రధాని చేసిన విజ్ఞప్తికి అమెరికా, మిత్ర దేశాలు సానుకూలంగా స్పందించేలా ఐక్యరాజ్య సమితి ఒత్తిడి తేవడం ఆవశ్యకం. బందీల విడుదల విషయంలో మంకుపట్టు పట్టిన హమాస్‌కు ముకుతాడు వేసేందుకు ఇరాన్, లెబనాన్ పూనుకోవాలి. ‘శాంతి కావాలనుకుంటే మిత్రులతో కాదు, శత్రువులతో చర్చించు’ అన్న మానవ హక్కుల నేత డెస్మండ్ టుటూ మాటలను ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవలసిన అవసరం ఉంది. అమెరికా వంటి అగ్రదేశాలు స్వార్ధప్రయోజనాలను విడనాడి, యుద్ధ పిపాసి ఇజ్రాయెల్ ను కట్టడి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తే గాజాస్ట్రిప్ కు కొంతలోకొంతైనా ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News