Sunday, December 22, 2024

ఈ దాడులు ఇంతటితో ఆగేనా?

- Advertisement -
- Advertisement -

ఒకేసారి ఏడుగురు శత్రువులతో యుద్ధం చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజం. అయితే ఆ యుద్ధం మితిమీరి, ప్రపంచ శాంతికి భంగం కలిగించే విధంగా మారడమే ఆందోళన కలిగించే విషయం. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా, వెస్ట్ బ్యాంకులో ఉగ్రవాదులు, ఇరాన్, ఇరాక్, సిరియాలకు చెందిన షియా మిలిటెంట్లతోపాటు యెమెన్‌లో హౌతీలతో ఇజ్రాయెల్ ఏకకాలంలో యుద్ధం కొనసాగిస్తోంది. ఉగ్రవాదుల ఏరివేత పేరిట ఇజ్రాయెల్ రగిలించిన రావణకాష్టం ఇప్పట్లో చల్లారేలా లేకపోగా, అంతకంతకూ యుద్ధజ్వాలలు పశ్చిమాసియా అంతటికీ విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది.

ఇరాన్ ఇటీవల తమ దేశంపై జరిపిన క్షిపణి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న నెతన్యాహూ రెండు రోజుల కిందట అన్నంతపనీ చేశారు. వంద యుద్ధ విమానాలతో ఇరాన్‌పై ప్రతి దాడికి దిగారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా, చమురు కేంద్రాలను లక్ష్యం చేసుకోకుండా సైనిక స్థావరాలను, క్షిపణి తయారీకి వినియోగించే ఇంధన మిశ్రమం ఉత్పత్తి కేంద్రాన్ని, ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను మాత్రమే దెబ్బతీయడం వ్యూహాత్మకమే. ఈ దాడితో మరో రెండేళ్ల వరకూ ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా చేయడంలో ఇజ్రాయెల్ విజయం సాధించిందనే చెప్పాలి. ఒకప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ మిత్రదేశాలే. 1979 తరువాత ఇరాన్‌లో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్‌కు శత్రువుగా మారింది. ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న ఇరాన్ విప్లవ నేత రుహొల్లా ఖోమేనీ..

అమెరికాను, దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ సామ్యాజ్యవాదాన్ని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన తదనంతరం ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఉభయ దేశాలూ ఇంతవరకూ ప్రత్యక్ష యుద్ధానికి దిగిన దాఖలాలు లేవు. ఇంతటి తీవ్రస్థాయిలో దాడులు, ప్రతిదాడులు జరగడం కూడా ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమని చెప్పుకోవాలి. అయితే అవకాశం దొరికినప్పుడల్లా ఇరాన్‌పై పరోక్ష దాడులకు పాల్పడటమే ఇజ్రాయెల్ పనిగా పెట్టుకుంది. ఇరాన్‌కు ప్రధాన వాణిజ్యమైన చమురు ఎగుమతులను దెబ్బతీయడమే లక్ష్యంగా గతంలో ఆ దేశానికి చెందిన చమురు నౌకలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ టెహ్రాన్‌లోని నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్ పైనా పలుమార్లు దాడులకు పాల్పడినట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ నుంచి అణుదాడుల ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గ్రహించిన ఇజ్రాయెల్, గత కొన్నేళ్లుగా ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్తలను పద్ధతి ప్రకారం హతమారుస్తూ వస్తోంది. ఇరాన్ వెలుపల ఉన్న ఆ దేశానికి చెందిన రెవెల్యూషనరీ గార్డ్ దళంలోని కీలక వ్యక్తులను కూడా మట్టుబెడుతోంది.

ఇవన్నీ సహిస్తూ వచ్చిన ఇరాన్, తమ దేశంపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన ప్రత్యక్ష దాడులకు దీటుగా సమాధానం ఎలా ఇవ్వాలనే విషయమై మల్లగుల్లాలు పడుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రతీకార దాడులకు పాల్పడకుండా సంయమనం పాటించవలసిందిగా అమెరికా చేసిన హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పైపెచ్చు, దశాబ్దాల తరబడి దిశానిర్దేశం చేస్తూ వస్తున్న ఆ దేశ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించి ఆస్పత్రి పాలవడం కూడా ఇరాన్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.

ఐక్యరాజ్య సమితి ఆదేశాలనూ, మిత్రదేశమైన అమెరికా హితోక్తులను సైతం పెడచెవిన పెట్టి, హమాస్, హెజ్బొల్లా ఉగ్రదళాలపై దాడుల పేరిట ఇజ్రాయెల్ దమనకాండ సాగిస్తున్న నేపథ్యంలో యుద్ధ విరమణకు ఖతార్, ఈజిప్టు, అమెరికా ప్రతినిధులు సాగిస్తున్న దౌత్యప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. మరో పది రోజుల్లో అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత దౌత్య యత్నాలు ముందుకు సాగే అవకాశం ఉండవచ్చు. అప్పటివరకూ వేచి చూడాలన్నదే ఇరాన్, ఇజ్రాయెల్ వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువనే సంగతి ఇరు దేశాలకూ తెలియనిది కాదు. దేశాల మధ్య సమస్యలకు యుద్ధం ఏనాటికీ పరిష్కారం కాదు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలన్న ఉత్తమమన్న ఐక్యరాజ్య సమితి హితోక్తులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెవికి ఎక్కించుకుంటే, ఇప్పటికైనా పశ్చిమాసియా కుదుటపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News