ఆదివారం తెల్లవారు జామున సెంట్రల్ గాజాలో ఓ మసీదు, స్కూలుపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 24 మంది మరణించినట్టు పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. 93 మంది గాయపడ్డారు. డెయిర్ అల్ బలాహ్ పట్టణం లోని అల్ అక్సా అమరవీరుల ఆస్పత్రికి సమీపంలో ఉన్న ఈ మసీదుతోపాటు ఓ స్కూలులో నిరాశ్రయులైన ప్రజలు ఉంటున్నారు. మసీదుతోపాటు ఐబిన్ రషీద్ స్కూలులో హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను టార్గెట్ చేసుకుని ఈ దాడి చేసినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది.
గత ఏడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయగా 1200 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక, 250 మంది బందీలుగా హమాస్ వారిని తీసుకెళ్లి బంధించింది. ఈ మారణకాండ జరిగి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా హమాస్‌ను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ ఆదివారం మసీదు, స్కూలుపై దాడి చేయడం గమనార్హం. అప్పటినుంచి ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో దాదాపు 42,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. 2.3 మిలియన్ మంది నిర్వాసితులయ్యారు.