Wednesday, January 22, 2025

అమానుష దాడి..

- Advertisement -
- Advertisement -

మంగళవారం సాయంత్రం గాజా నగరంలోని ఒక ఆసుపత్రిపై జరిగిన భయంకరమైన బాంబు దాడి అప్పటికే మందులు, చికిత్స కొరవడి దయనీయ స్థితిలో వున్న వందలాది మంది రోగుల ప్రాణాలను బలి తీసుకొన్నది. హమాస్ చేసిన ప్రకటన ప్రకారం ఈ దాడిలో 500 మంది రోగులు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడికి బాధ్యతను ఇజ్రాయెల్ హమాస్ ఒకరికపై ఒకరు నెట్టుకోడం మరింత విషాదకర పరిణామం. బుధవారం నాడు ఇజ్రాయెల్‌ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దాడి బాధ్యతను హమాస్ పైకి నెట్టివేసి ఇజ్రాయెల్‌ను నెత్తిన పెట్టుకొన్నారు. అదే సమయంలో గాజాకు ఆహారం, మందులు తదితర సాయాన్ని పంపించేలా ఇజ్రాయెల్‌ను బైడెన్ ఒప్పించడం ఒక మంచి పరిణామం. అయితే గాజాకు మానవతా సాయాన్ని పంపిస్తూ హమాస్‌ను ఏరివేసే పేరిట దానిపై దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తుందని అర్థమవుతున్నది. ఆ ప్రాంతంలో శాంతికి ఇది ఎంత మాత్రం దోహదం చేయదు. అసలు సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

పాలస్తీనాకు అక్కడ స్వతంత్ర దేశాన్ని ఇవ్వనంత వరకు ఇలాగే పరస్పర దాడులు జరుగుతూ వుంటాయి, మారణ రక్తపాతం తరచూ సంభవిస్తూ వుంటాయి. ఇజ్రాయెల్‌కు దాని మద్దతుదారులైన అమెరికా, పాశ్చాత్య దేశాలకు కూడా కావలసింది ఇదే. ప్రస్తుతం అయితే ఈజిప్టులోని రఫా సరిహద్దు మార్గం గుండా గాజాలోని బాధిత పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసుపత్రిపై దాడి తర్వాత అరబ్ దేశాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దాడి ఇజ్రాయెల్ పనేనని ఆ దేశాల ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ దాడి అరబ్ నేతలతో బైడెన్ చర్చలకు విఘాతం కలిగించింది. లేని పక్షంలో ఆయన జోర్డాన్ రాజుతోను, వెస్ట్‌బ్యాంకులోని పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తోను, ఈజిప్టు అధ్యక్షుడు సిసితోను చర్చలు జరిపి వుండేవారు. అవి అర్థంతరంగా ఆగిపోడం వల్ల ఆయన ఇజ్రాయెల్ పర్యటనతో సరిపుచ్చుకొన్నారు. బైడెన్ తర్వాత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఇజ్రాయెల్‌ను సందర్శించారు, దానికి తమ సంపూర్ణమైన మద్దతును మరింత స్పష్టంగా పునరుద్ఘాటించారు.

గాజాకు పంపిస్తున్న సహాయం హమాస్ చేతుల్లోకి వెళ్ళకుండా చూడాల్సిన అవసరాన్ని ఇజ్రాయెల్ నొక్కి చెప్పింది. పశ్చిమాసియా దేశాలకు, తమకు మధ్య సాగుతున్న చర్చలు కొనసాగకుండా చేయడానికే హమాస్ దాడి చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బ్రిటన్ అధినేత సునాక్‌తో చెప్పడం గమనించవలసిన విషయం. వామపక్ష, ప్రజాస్వామిక భావజాలం గల విమర్శకులు కొంత మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. అరబ్ దేశాలను, ఇజ్రాయెల్‌ను కలిపి పాలస్తీనాను ఏకాకిని చేయడం ద్వారా స్వతంత్ర పాలస్తీనా లక్షాన్ని దెబ్బ తీయడానికి అమెరికా చూస్తున్నదనే అభిప్రాయం వున్నది. అందుచేతనే ఆ చర్చలు పరిపూర్ణ స్థాయికి చేరుకొనే లోగా వాటిని విఫలం చేయాలని భావించి మొన్న 7వ తేదీనాడు హమాస్ అపూర్వ స్థాయిలో ఇజ్రాయెల్‌పైకి విరుచుకుపడిందనే కోణాన్ని పూర్తిగా కొట్టిపారేయలేము. ఇప్పటి ఘర్షణ ముదిరి పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థాయి యుద్ధం చెలరేగడం కూడా అమెరికాకు ఇష్టం లేదు. అందుచేతనే బైడెన్, సునాక్‌లు హుటాహుటిన ఇజ్రాయెల్‌ను సందర్శించారని బోధపడుతున్నది.

ఆసుపత్రిపై దాడిని యూరపు దేశాలన్నీ ఖండించాయి. అదే సమయంలో సమస్యకు శాశ్వత పరిష్కారం వైపు అమెరికాపై గాని, ఇజ్రాయెల్ పైన గాని ఒత్తిడి కల్పించడానికి అవి సిద్ధంగా లేవని స్పష్టపడుతున్నది. ఈ నేపథ్యంలో అరబ్ దేశాలన్నీ మరొకసారి పాలస్తీనా వెంట సంఘటితం కావడం వల్ల మేలు జరగవచ్చు. కాని అది జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ప్రస్తుతానికైతే ఇరాన్, హెజ్బుల్లా మిలిటెంట్లు పాలస్తీనాకు గట్టి మద్దతుగా వున్నట్టు తెలుస్తున్నది. ఇజ్రాయెల్‌పై మొన్న చేసిన దాడికి అవసరమైన ఆయుధ సాయం కూడా హమాస్‌కు ఇరాన్ నుంచే అందిందని కొన్ని వార్తలు వెల్లడించాయి. అంతర్జాతీయ రంగంలో అమెరికా బలం సన్నగిల్లితే గాని ఇజ్రాయెల్ దారికి వచ్చే సూచనలు లేవు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎంత కాలం సాగుతుందో , ఏ మలుపు తిరుగుతుందో అనేది కూడా ఇక్కడ కీలకం. ఉక్రెయిన్ సొంత బలంతో కాకుండా అమెరికా నుంచి లభించే ఆయుధ సాయంతో ఎంత కాలం రష్యాతో పోరాడగలుగుతుందో చూడాలి.

అలాగే గతంలో రష్యా నుంచి గ్యాస్, ఆయిల్ సునాయాసంగా పొందుతూ వచ్చిన యూరపు దేశాలు తిరిగి అప్పటి పరిస్థితిని కోరుకొనే రోజులు దగ్గర పడితే అమెరికా తగ్గడానికి అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు అమెరికాను తలదన్నాలని ఆశిస్తున్న చైనా వ్యూహం ఎలా వుంటుందనేది కూడా ముఖ్యమే. ప్రస్తుతానికైతే పాలస్తీనియన్ల దయనీయ స్థితి ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News