Monday, December 23, 2024

శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది..

- Advertisement -
- Advertisement -

శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది
దక్షిణ గాజా ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
50 మందికి పైగా మృతి, పలు భవనాలు నేలమట్టం
ఆస్పత్రుల్లో అడుగంటుతున్న ఇంధన నిల్వలు
రోగుల చికిత్సకు వైద్య సిబ్బంది అష్టకష్టాలు
రఫా సరిహద్దులు మూసివేత, నిత్యావసరాలతో ఆగిపోయిన వందలాది ట్రక్కులు
నేడు ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటన
నిఘా వైఫల్యానికి పూర్తి బాధ్యత మాదే: ఐఎస్‌ఎ చీఫ్
ఖాన్ యూనిస్(గాజా స్ట్రిప్): గాజాపై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉత్తర గాజా ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్న ఇజ్రాయెల్ బలగాల హెచ్చరికలతో దక్షిణ ప్రాంతంతో పాటుగా ఇతర దేశాల శరణు వేడుతూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, ఈజిప్టు సరిహద్దులోని ఖాన్ యూనిస్, రఫా పట్టణాలకు లక్షల సంఖ్యలో గాజా పౌరులు చేరుకున్నారు. ఇదే సమయంలో ఈ రెండు ప్రాంతాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 50 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ కచ్చితమైన సమాచారం లేదు. ఖాన్ యూనిస్‌లోని నాస్సెర్ ఆస్పత్రికి 50 మృతదేహాలను తీసుకురావడాన్ని తాను చూసినట్లు ఎపి వార్తాసంస్థ ప్రతినిధి తెలిపారు.

డీర్ అల్ బలా పట్టణంలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆ భవనం పూర్తిగా నేలమట్టమవడంతో అందులో నివసిస్తున్న 9 మందీ చనిపోయారు. పక్కనే ఉన్న మరో భవనంలోని గాజానుంచి ఖాళీ చేయించిన మరో కుటుంబానికి చెందిన ముగ్గరు చనిపోయారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, పిల్లలున్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఖాన్ యూనిస్‌తో పాటుగా రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం భారీ స్థాయిలో దాడులు.రిపినట్లు గాజా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయని, వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. గాజానుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న లక్షలాది మంది రఫా ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో ఈ దాడులు జరిగాయి.

సరిహద్దుల్లో నిలిచిపోయిన నిత్యవసరాల ట్రక్కులు
మరో వైపు ఇజ్రాయెల్, గాజా మధ్య జరుగుతున్న పోరులో భారీఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. ఇప్పటివరకు ఇరువైపులా దాదాపు 4 వేల మంది చనిపోగా, 9 వేల మందికి పైగా గాయపడ్డారు. పది లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈజిప్టుకు వెళ్లేందుకు రఫా సరిహద్దు వద్ద వేచి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు వారిని అనుమతించడం లేదు. గాజాలోకి ఆహారం, ఇంధనం సహా నిత్యావసరాల సరఫరాలను ఇజ్రాయెల్ నిలిపివేయడంతో అక్కడి ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీరు సైతం లేక అల్లాడిపోతున్నారు.

మరోవైపు ఆస్పత్రుల్లో జనరేటర్లకు ఇంధన కొరత తీవ్రంగా ఉంది. మరో 24గంటల్లో ఇంధనాలు నిండుకుంటాయని, ఆక్సిజన్, ఇంక్యుబేటర్ల కొరత తీవ్రంగా ఉందని,రోగులకు చికిత్స అందించడం కూడా కష్టమవుతోందని ఐరాస నేతృత్వంలోని ఆస్పత్రుల సిబ్బంది అంటున్నారు. ఆహారం,ఔషధాలు, వైద్య పరికరాలతో పాటుగా ఇతర అత్యవసర సరకులతో గాజాకి వచ్చే దాదాపు 300కు పైగా ట్రక్కులు రఫా సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. అత్యవసర సరఫరాలు, పౌరులను అనుమతించడం కోసం ఇజ్రాయెల్ తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించేలా చూడడానికి మధ్యవర్తులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

నేడు ఇజ్రాయెల్, జోర్డాన్‌లలో బైడెన్ పర్యటన
గాజాలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న వేళ ఈ సందిగ్ధతను తొలగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది. ఆయన జోర్డాన్‌కూ వెళ్తారని, అక్కడ ఈజిప్టు,పాలస్తీనా, జోర్డాన్ దేశాధినేతలతోనూ సమావేశం కానున్నట్లు తెలిపింది. క్రూరమైన హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే బైడెన్ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపింది.అలాగే తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా ఆయన ఇజ్రాయెల్ అధికారులతో చర్చిస్తారని వెల్లడించింది. అక్కడినుంచి జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు వెళతారని తెలిపింది.అక్కడ జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్‌సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారని తెలిపింది.పాలస్తీనా ప్రజల గౌరవం, స్వయంనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించబోదని బైడెన్ ఈ భేటీలో పునరుద్ఘాటిస్తారని తెలిపింది.

అలాగే గాజాలోని మానవతా సంక్షోభ నివారణ గురించీ చర్చిస్తారని తెలిపింది.అంతకు ముందు బైడెన్ ఈజిప్టు అధ్యక్షుడితో పాటు ఇరాక్ ప్రధాని మహమ్మద్ శియా అల్‌సుడానీతోను ఫోన్‌లోమాట్లాడారు. హమాస్ దాడి తర్వాత ఆ ప్రాంతంలోని పరిస్థితులపై ఆరా తీశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకొంటున్నటుల ఆ దేశాల నేతలు తెలిపారు. గాజాలో మానవతా సంక్షోభం,దాని నివారణకు ఐరాస సమన్వయంతో తీసుకొంటున్న చర్యలపైనా చర్చించారు. మరో వైపు గాజాలో బందీలను విడిచిపెట్టాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. మానవతా సాయాన్ని అడ్డుకోవద్దని ఇటు ఇజ్రాయెల్‌కూ హితవు పలికారు.

నిఘా వైఫల్యానికి పూర్తి బాధ్యత మాదే: ఐఎస్‌ఎ చీఫ్
ఇదిలా ఉండగా ఈ నెల 7న హమాస్ జరిపిన పాశవిక దాడుల్లో నిఘా వైఫల్యానికి పూర్తి బాధ్యత తమదేనని ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా ఏజన్సీ ( ఐఎస్‌ఎ) చీఫ్ రోనేన్ బార్ అంగీకరించారు. ఈ దాడుల్లో 1300 మందికి పైగా ఇజ్రాయెలీలు సహా పలువురు విదేశీయులు మరణించారు. ఈ దాడులపై బార్ తొలిసారిగా స్పందించారు. ఈ మెరుపుదాడిపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు.‘ ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ అక్టోబర్ 7వ తేదీ దాడిని ముందస్తుగానే గ్రహించలేకపోయాం.ఈ నేపథ్యంలో సంస్థ అధ్యక్షుడిగా ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే’ అని ఆయన వెల్లడించినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం దీనిపై దర్యాప్తు ప్రస్తుతం చురుగ్గా జరుగుతోంది. ఈ దాడులు జరిగిన మర్నాడే ఐఎస్‌ఎతో సమన్వయానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని బార్ తెలిపారు. అపహరణకు గురైన వారిని గుర్తించి వారిని రక్షించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశ దక్షిణ భాగంలో తమ సభ్యులు ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడారని తెలిపారు. ఈ క్రమంలో పదిమంది సభ్యులను కోల్పోయామని తెలిపారు. అంతేకాదు పట్టుబడిన హమాస్ సభ్యులనుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు చెప్పారు. తాము యుద్ధంలో ఉన్నామని, కేవలం పరిస్థితి మార్పు వల్ల.. ఒక్క నిర్ణయంతోనే యుద్ధం ముగుస్తుందని, దీనికి ఎలాంటి కాలవ్యవధి లేదన్నారు.

రష్యా తీర్మానానికి భద్రతా మండలి తిరస్కృతి
ఇదిలా ఉండగా గాజాలో పౌరులపై జరుగుతున్న హింసాకాండను, ఉగ్రవాదాన్ని ఖండిస్తూ రష్యా ప్రవేశపెట్టిన ఓ ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం రాత్రి తిరస్కరించింది. ఈ తీర్మానంలో హమాస్ ప్రస్తావన ఎక్కడా లేకపోవడం గమనార్హం. తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్‌లో నాలుగు దేశాలు చైనా, యుఎఇ, మొజాంబిక్, గబన్ మాత్రమే రష్యాకు మద్దతుగా నిలిచాయి. నాలుగు దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్‌లు దీనికి వ్యతిరేకంగా ఓటేశాయి. మిగతా ఆరు దేశాలు ఓటింగ్‌కు గైర్‌హాజరయ్యాయి.

15 మంది సభ్యులుంగే మండలిలో తీర్మానాన్ని ఆమోదించడానికి కనీసం9 ఓట్లు అనుకూలంగా రావాలి. కాగా రష్యా తీర్మానం తిరస్కరణకు గురయిన నేపథ్యంలో హింసాకాండను ఖండించడంతో పాటుగా హమాస్ జరిపిన అమానుష దాడులను కూడా నిర్దంద్వంగా ఖండిస్తూ బ్రెజిల్‌రూపొందించిన మరో తీర్మానాన్ని ఆమోదించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని ఐరాసలో బ్రిటన్ రాయబారి బర్బరా ఉడ్‌వార్డ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News