కొన్నివారాలుగా అప్రమత్తంగా ఉన్నాం
ఇజ్రాయెల్ రాయబారి రాన్‌మల్కా
న్యూఢిల్లీ: తమ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన బాంబు పేలుడు తమను ఆశ్చర్యపరచలేదని ఇజ్రాయెల్ రాయబారి రాన్‌మల్కా అన్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు తాము కొన్ని వారాలుగా అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇది ఉగ్రవాదుల దాడే అనేందుకు పలు కారణాలున్నాయని ఆయన అన్నారు. దాడి జరిగిన మరుసటిరోజున(శనివారం) ఆయన స్పందించారు. 2012లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలపై దాడికి పాల్పడ్డవారితో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా..? అన్న కోణంలోనూ దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. పశ్చిమాసియాలో శాంతి కోసం తాము చేపట్టిన కార్యక్రమాలను ఇలాంటి దాడులకు భయపడి ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి వెనకాల ఇరాన్ ఉన్నదన్న అనుమానాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. అన్ని అంశాల్ని క్షుణ్నంగా పరిశీలించి ఈ చెడు దాడికి ఎవరు బాధ్యులో గుర్తిస్తామని ఆయన అన్నారు. ఘటన జరిగింది ఇండియాలోనే కనుక ఇక్కడి అధికారులే దర్యాప్తు జరపాలని, తమపరంగా అవసరమైన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.