Sunday, December 22, 2024

ఇజ్రాయెల్‌లో జర్నలిస్టులు జైలుకి!

- Advertisement -
- Advertisement -

మధ్య ఆసియాలో ప్రజాస్వామ్య దేశంగా, స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు నెలవుగా పేరొందిన ఇజ్రాయెల్ ఓ దేశంగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా హమాస్ తీవ్రవాదుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటూ, దారుణమైన యుద్ధంలో చిక్కుకొంది. ఈ యుద్ధం మొత్తం మధ్య ఆసియాకు వ్యాపిస్తూ, తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తూ అంతర్జాతీయంగా కూడా ఘర్షణమయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో జర్నలిస్టులు తమ వ్యాపకం స్వేచ్ఛగా కొనసాగించడం దుర్లభంగా మారింది. ఇజ్రాయెల్ మొదటిసారి జర్నలిస్టులను అధిక సంఖ్యలో జైలుకు పంపుతున్న దేశంగా ఖ్యాతి గడించింది. తాజాగా ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్’ (సిపిజె) విడుదల చేసిన జైళ్లలో గడుపుతున్న జర్నలిస్టుల వార్షిక నివేదిక ప్రకారం గత నెల డిసెంబర్ 1 నాటికి ఈ దేశంలో 17 మంది జర్నలిస్టులు జైళ్లలో ఉన్నారు.

1992లో జర్నలిస్టుల అరెస్టులను సిపిజె నమోదు చేయడం ప్రారంభించిన తర్వాత నిర్బంధంలో ఉన్న పాలస్తీనా జర్నలిస్టుల సంఖ్య ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఎక్కువగా జర్నలిస్టులను జైళ్లలో పెట్టిన దేశాలలో ఆరవ దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్- గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 80 మందికి పైగా జర్నలిస్టులు మరణించడంతో జర్నలిస్టులకు మృత్యుకూపంగా మొదటిసారి ఇజ్రాయెల్ మారింది. సిపిజె నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 320 మంది జర్నలిస్టులు తమ వృత్తి వ్యాపకానికి సంబంధించి డిసెంబర్ 1, 2023 నాటికి ఖైదు చేయబడ్డారు. 1962 నుండి సిపిజె విడుదల చేస్తున్న వార్షిక నివేదికలలో అత్యధికంగా జర్నలిస్టులు జైలుకు వెళ్లిన రెండో సంవత్సరం ఇదే. ఇదివరలో అత్యధికంగా 2022లో 360 మంది జైలుకెళ్లారు. 2023లో అత్యధికంగా జర్నలిస్టులను జైలుకు పంపిన దేశాలు చైనా (44), మయన్మార్ (43), బెలారస్ (28). అంటే మొత్తం జైళ్లలో ఉన్న జర్నలిస్టులలో మూడవ వంతు (35.8%) మంది ఈ మూడు దేశాలలోనే ఉన్నారు.ఆ తర్వాత రష్యా (22), వియత్నాం (19)లలో ఎక్కువ మంది జర్నలిస్టులు జైళ్లలో ఉన్నారు.

‘క్రిటికల్ రిపోర్టింగ్‌ను అరికట్టడానికి, ప్రజల జవాబుదారీతనాన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు ధైర్యంగా ఉండడంతో, ప్రపంచ వ్యాప్తంగా అధికారవాదం ఎంతగా పాతుకుపోయిందో మా పరిశోధన చూపిస్తుంది. పాలస్తీనా జర్నలిస్టులను నిశ్శబ్దం చేయడానికి ఇజ్రాయెల్ క్రూరమైన పద్ధతులను ఉపయోగించడంతో ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రమాణం పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తున్నట్టు రుజువు చేస్తుంది’ అని సిపిజె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోడీ గిన్స్‌బర్గ్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ ఈ జాబితాలో ముందంజలో ఉండేందుకు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో అనుసరిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ నిర్బంధం కారణమవుతుంది. కేవలం ఒక సైనిక కమాండర్ ఎవరినైనా ఎటువంటి అభియోగాలు లేకుండా నిర్బంధించడానికి, వారి నిర్బంధాన్ని భవిష్యత్‌లో నేరం చేయవచ్చనే ఆరోపణతో అపరిమిత సంఖ్యలో పొడిగించడానికి అనుమతిస్తున్నారు.
సాధారణంగా తమ విధానాలను తప్పుబడుతూ కథనాలు రాసే జర్నలిస్టులను రాజకీయ నాయకులు లక్ష్యంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.

కానీ ఇటీవల కాలంలో మెజారిటీ జర్నలిస్టులు తమ విమర్శనాత్మక కథనాలకు ప్రతీకారంగా తప్పుడు వార్తలు రాశారనో, ఉగ్రవాదం వంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులలో 65 శాతానికి పైగా నకిలీ వార్తలు, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 60 మందికి పైగా జర్నలిస్టులు ఎలాంటి అభియోగాలు వెల్లడించకుండా నిర్బంధానికి గురయ్యారు. రష్యా, ఇథోఫియా వంటి దేశాలు తమ సరిహద్దులను దాటి జర్నలిస్టులను వేధిస్తుంటే, ఎటువంటి నేరారోపణలు లేకుండా సుదీర్ఘకాలం జర్నలిస్టులను జైళ్లలో ఉంచడం, వారి పట్ల క్రూరమైన విధంగా వ్యవహరించడం చాలా దేశాల్లో సర్వసాధారణంగా మారుతున్నది.

వియత్నాం, ఈజిప్టు వంటి దేశాలలో వారు విడుదలైన తర్వాత కూడా జర్నలిస్టులపై ప్రయాణ నిషేధాలు, ఇతర ఉద్యమ ఆంక్షలు విధిస్తూ వారి స్వేచ్ఛను కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మనం ఒక క్లిష్టమైన పరిస్థితికి చేరుకున్నాము. రిపోర్టింగ్‌ను నిశ్శబ్దం చేసే చట్టాల ఆయుధీకరణకు ముగింపు పలకాలి. జర్నలిస్టులు రిపోర్ట్ చేయడానికి స్వేచ్ఛగా ఉండేలా చూడాలి’ అని గిన్స్‌బర్గ్ చెప్పారు. 2024లో 75కు పైగా దేశాలలో ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికా, రష్యా, భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో పాటు ఇండోనేషియా, పాకిస్తాన్, ఉక్రెయిన్, మెక్సికో, వెనిజులాలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఐరోపాలోని దాదాపు తొమ్మిది దేశాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటీవలనే మొత్తం ప్రతిపక్షాలు పాల్గొనకుండా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగడాన్ని చూసాము. తైవాన్ ఎన్నికలు జరిగాయి. ఇటువంటి సమయంలో జర్నలిస్టులు నిర్భయంగా తమ వృత్తి వ్యాపకాలను చేపట్టలేకపోతే మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాద ఘడియలు కాగలవని గ్రహించాలి.

సిపిజె నివేదిక ప్రకారం 2023లో అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు జైల్లో ఉన్న ప్రాంతంగా ఆసియా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా జర్నలిస్టులు జైళ్లలో ఉన్న మూడు దేశాలు- చైనా, మయన్మార్, వియత్నాం కూడా ఆసియాలోనే ఉండటం గమనార్హం. వీటితో పాటు భారత్, అఫ్ఘానిస్తాన్, ఫిలిప్పీన్స్‌లలో సహితం పలువురు జర్నలిస్ట్లు కటకటాల వెనుక ఉన్నారు. ఉగ్రవాద వ్యతిరేక ఆరోపణలు, ప్రమాదకరమైన చట్టాల క్రింద ఆరోపణలు, న్యూస్ రూమ్‌లపై దర్యాప్తు సంస్థల దాడులు సర్వసాధారణంగా మారిన దేశాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడం పత్రికా స్వేచ్ఛకు ఒక విషమ పరీక్షగా భావించవచ్చు. జర్నలిస్టుల విషయంలో ప్రపంచంలోనే ఎక్కువగా జర్నలిస్టులను జైళ్లకు పంపే దేశాలలో అగ్రగామిగా సంవత్సరాల తరబడి ఉంటూ వస్తున్న చైనాలో సెన్సార్‌షిప్ అమలులో ఉంటున్నది. అసలు ఆ దేశంలో ఎంత మంది జర్నలిస్టులు జైళ్లలో ఉన్నారో ఖచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొంది.

సామూహిక ప్రజాస్వామ్య అనుకూల నిరసనల మధ్య బీజింగ్ కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని అనుసరించి హాంకాంగ్‌లో తన సెన్సార్‌షిప్ పాలనను కొనసాగిస్తోంది. ఇప్పుడు మూతబడిన ప్రజాస్వామ్య అనుకూల వార్తాపత్రిక ‘ఆపిల్ డైలీ’ వ్యవస్థాపకుడు జిమ్మీ లై విదేశీ కుట్ర ఆరోపణలపై తనపై చివరకు విచారణ ప్రారంభించడానికి ముందు దాదాపు 1,100 రోజులు కటకటాల వెనుక ఉండాల్సి వచ్చింది. ఐరోపా, మధ్య ఆసియాలో, బెలారస్, రష్యా- ఉక్రెయిన్‌పై మాస్కో పూర్తి స్థాయి యుద్ధంలో మిత్రపక్షాలు- అసమాన సంఖ్యలో జర్నలిస్టులను కటకటాల వెనుక ఉంచాయి. బెలారసియన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో వివాదాస్పద రీఎంపికపై సామూహిక నిరసనల తర్వాత, బెలారసియన్ అధికారులు 2020 నుండి జర్నలిస్టులను ఎక్కువగా జైళ్లలో పెడుతున్నారు. బెలారస్‌లోని 70% పైగా జర్నలిస్టులు ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దాదాపు సగం మంది ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్షలు అనుభవిస్తున్నారు. విదేశీ రిపోర్టర్లను జైలు లో పెట్టడంలో రష్యా నిష్ణాతులుగా మారింది.

ఖైదు చేసిన 17 మంది విదేశీ -జాతీయ జర్నలిస్టులలో 12 మంది వివిధ దేశాలకు చెందినవారు. వీరిలో అమెరికాకు చెందిన ఇవాన్ గెర్ష్‌కోవిచ్, అల్సు కుర్మాషెవా ఇద్దరూ విచారణ ప్రారంభం కాకుండానే నిర్బంధంలో ఉన్నారు. అంతర్జాతీయ అణచివేతలో భాగంగా ఇతర దేశాలలో నివసిస్తున్న రష్యన్ జర్నలిస్టులపై కూడా రష్యా అరెస్టు వారెంట్లు జారీ చేస్తున్నది. జైలు శిక్షకు గురవుతున్న వారు తరచుగా నిస్సందేహంగా క్రూరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. అధికారులు జర్నలిస్టులపై నిర్దుష్ట ఆరోపణలు, విచారణ లేకుండానే నిర్బంధాన్ని పొడిగిస్తుంటారు. జర్నలిస్టులకు న్యాయ సహాయం అందించేందుకు ముందుకు వచ్చే న్యాయవాదులు సహితం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీకార చర్యలను ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News