Monday, December 30, 2024

ఇజ్రాయెల్ దాడులతో అంటుకున్న టెంట్..45 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గాజాసిటీలోని రఫా ప్రాంతం ఇజ్రాయెల్ విమానాల బాంబుదాడులతో తల్లడిల్లింది. దాడులతో తలెత్తిన మంటలలో ఓ టెంట్ తగులబడిపోయింది. ఇందులోని దాదాపు 45 మంది బుగ్గి అయ్యారు. సోమవారం జరిగిన ఈ భయానక దాడిలో , తరువాతి మంటలలో చనిపోయింది ఎక్కువగా శరణార్థులే అని వెల్లడైంది. 45 మందికి పైగా దుర్మరణం చెందారని, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని రఫా అధికారులు సోమవారం తెలిపారు. రఫాపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఓ వైపు ప్రపంచ న్యాయస్థానం పిలుపు నిచ్చింది. ఈ దశలోనే ఇజ్రాయెల్ వీటిని పట్టించుకోకుండా వైమానిక దాడులను ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ వెంటనే సంయమనం పాటించాలని , ప్రపంచ న్యాయస్థానం రూలింగ్‌ను పాటించాలని ప్రపంచ స్థాయి నేతలు సోమవారం ప్రకటనలు వెలువరించారు. ఎనిమిది నెలలుగా సాగుతున్న రక్తపాతం, సామాన్యుడి హాహాకారాల నడుమ రఫా ప్రాంతం ఇప్పుడు ఇజ్రాయెల్ నైపుణ్య సేనల దాడులతో నెత్తుటి ఆక్రందనలతో మార్మోగుతోంది.

ఆదివారం రాత్రి తరువాత ఇజ్రాయెల్ సైనిక విమానాలు భీకర రీతిలో దాడులకు దిగాయి. దీనితో ఓ చోట టెంటుకు నిప్పంటుకుంది. టెంట్‌లోని తమ వారు బూడిదైన క్రమంలో వారిని అంత్యక్రియలకు తరలించేందుకు పాలస్తీనియన్లు తెల్లవారుజామున ఈ ప్రాంతానికి ఉరుకులుపరుగులపై వెళ్లారు. ఒకేచోట ఉంచిన శవాల అవశేషాల వద్ద మహిళలు, వృద్ధులు నిలబడి కన్నీరుమున్నీరయ్యారు. రఫాను ఇజ్రాయెల్ సజీవంగా తగులబెడుతోంది. అయితే ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ప్రపంచదేశాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని రఫా నివాసి బాస్సామ్ వాపోయారు. ఇజ్రాయెల్ దాడులను నిలిపివేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పుడు రఫా పశ్చిమ ప్రాంతంలో దాడి జరిగిన ఈ ప్రాంతం నిజానికి దాడుల నిషేధిత సురక్షిత ప్రాంతంగా ప్రకటితం అయింది. అయితే ఈ ప్రాంతమే ఇప్పుడు టార్గెట్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News