Sunday, December 22, 2024

గాజాపై ఇజ్రాయెల్ దాడులు…14 మంది పాలస్తీనియన్ల మృతి

- Advertisement -
- Advertisement -

డెయిర్ అల్ బలా (గాజా స్ట్రిప్): గాజాపై ఇజ్రాయెల్ జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో 14 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. సోమవారం రాత్రి దాటాక జరిపిన దాడిలో 11 మంది చనిపోగా, మంగళవారం దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి మువాసీలో తాత్కాలిక ఫలహారశాలపై దాడి జరిగింది. మానవతా జోన్‌గా ప్రకటించిన ప్రాంతం లోనే ఈ దాడి జరగడం గమనార్హం. జోన్‌ను విస్తరిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొన్ని గంటల్లోనే దాడులు జరిగాయి. నిర్వాసితులైన పాలస్తీనియన్లు మువాసీ శిబిరాల్లోనే తలదాచుకొంటున్నారు. మంగళవారం సెంట్రల్ గాజా లోని అర్బన్ నసీరత్ శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో ఒక మహిళతో సహా ముగ్గురు మృతి చెందారని అల్ అవ్డా ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మరో 11 మంది గాయపడ్డారు. గాజాలో మానవతా సాయం ఎక్కువగా అందడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా ఈ వారం గడువు విధించింది. లేకుంటే నిధులపై ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. అయినాసరే అమెరికా డిమాండ్లను నెరవేర్చడంలో ఇజ్రాయెల్ విఫలమైందని ఎనిమిది అంతర్జాతీయ సహాయ సంస్థల గ్రూపు మంగళవారం తన నివేదికలో పేర్కొంది. రెండు దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News