Friday, December 20, 2024

గాజాలో షిఫా ఆసుపత్రి ఆర్తనాదం

- Advertisement -
- Advertisement -

అల్‌షిఫా ఆసుపత్రి : బుధవారం తెల్లవారుతూనే గాజాసిటిలోని అతిపెద్ద ఆసుపత్రి అల్‌షిఫాలోకి సాయుధులైన వందలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశించారు. కొందరు మాస్క్‌లు ధరించి ఉన్నారు. చేతుల్లోని గన్స్ గాలిలోకి పేలుస్తూ లోపల 16 సంవత్సరాలు అంతకు మించి వయస్సున్న వారంతా చేతులు పైకెత్తాలని గదమాయించారు. అరబీ యాస్‌లో వారి అరుపులతో రోగులు మగతగా కళ్లు తెరిచారు. లౌడ్‌స్పీకర్లలో ఆజ్ఞలు వెలువరిస్తూ ప్రతి ఒక్కరిని డేగకండ్లతో నిశితంగా పరిశీలించారు. లోపల ఎవరైనా హమాస్ వ్యక్తులు ఉంటే వెనుక గేటు ద్వారా వెల్లి సరెండర్ కావాలని సైనిక కమాండర్లు ఆదేశించడంతో చాలా సేపటి వరకూ రోగులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఓ జర్నలిస్టు చాలా రోజులుగా వీధుల్లోకి వెళ్లలేని స్థితిలో లోపల తలదాచుకుంటున్నారు. ఆయన తమ వార్తా సంస్థకు వార్తాకథనం పంపించారు. ఇజ్రాయెల్ సేనలు ఆసుపత్రి కారిడార్లలో బూట్ల చప్పుళ్లు, గాలిలో కాల్పుల మోతలతో కలియతిరిగారు.

దీనితో ఆసుపత్రి నిశ్శబ్ధ వాతావరణం భగ్నమైంది. ఒకే బెడ్‌పై పలు చోట్ల నవజాత శిశువులు రోదిస్తూ ఉండటం, పక్కనే తల్లులు వారి సమీప బంధువులు తల్లడిల్లడం కన్పించింది. సైన్యం ఆసుపత్రిలోకి చొరబడి ఉందని తెలియడంతో ఆసుపత్రిలోని పలు వార్డులలో కదలిక ఏర్పడింది. ప్రసూతి విభాగాలు, అత్యవసర చికిత్సల విభాగాల నుంచి కూడా వందలాదిగా ఎక్కువగా యువతరం బయటికి పరుగులు తీయాల్సి వచ్చింది. ప్రతి రూం కలియతిరుగుతూ సైనికులు గాలిలో కాల్పులతో హమాస్ మిలిటెంట్ల జాడ కోసం వెతికారు. ఆసుపత్రి ఆవరణ అంతటా సైనిక ట్యాంకులు నిండిపొయ్యాయి. తమ కీలక ఆపరేషన్ దశలో ఆసుపత్రిలోని ప్రధాన విభాగాలలో పలు పరికరాలు సవ్యంగా పనిచేసేలా చూశామని , శిశువులకు సరైన ఆహారం , పాలు అందించామని సైన్యం తెలిపింది. అత్యవసర సరఫరాలు అందేలా అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు తమ వైద్య సిబ్బంది, అరబీలో మాట్లాడగలిగే సైనికులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ,

అంతా సజావుగా ఉండేలా చేశారని ఇజ్రాయెల్ సైనిక ఉన్నతాధికారులు వివరించారు. ఈ వాదనను హమాస్, స్థానిక అధికార యంత్రాంగం తోసిపుచ్చింది. అత్యంత కర్కశంగా ఆసుపత్రిలో దాడులకు దిగుతూ , రోగులను ప్రాణాపాయ స్థితికి తెస్తూ గడుపుతోన్న సైనికులు చెప్పే మాటలు విచిత్రంగా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న యుద్ధ నేరాలకు ఈ ఆసుపత్రి దాడి పరాకాష్ట అని హమాస్ తరఫు గాజా ప్రభుత్వం విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News