గాజా: వెస్ట్‌బ్యాంకులోని ఓ ఆస్పత్రిలో దాక్కొన్న ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మట్టుబెట్టాయి.స్థానిక ‘ఇబ్న్ సినా’ ఆస్పత్రిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మరణించిన ముగ్గురు వ్యక్తులు తమ జెనిన్ బ్రిగేడ్ సభ్యులని హమాస్ ప్రకటించింది. వీరు ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలను రంగంలోకి దింపింది. వీరు వేర్వేరుగా సాధారణ వైద్య సిబ్బంది, పౌరుల వేషధారణలో అక్కడికి చేరుకున్నారు.వీరిలో కొందరు హిజాబ్‌లు కూడా ధరించారు. ఆస్పత్రిలోని మూడో ఫ్లోర్‌లో మిలిటెంట్లు ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడికి చేరుకుని ముగ్గురినీ మట్టుబెట్టారు. కేవలం 10 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
దాడి జరిగిన సమయంలో మిలిటెంట్లు గాఢనిద్రలో ఉన్నట్లు తెలిపింది.మృతుల్లోని హమాస్ మిలిటెంట్ మహ్మద్ జలమ్నెహ్ కొంతకాలంగా ఈ ఆస్పత్రిని వేదికగా చేసుకుని ఉగ్రకార్యకాలాపాలు జరుపుతున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. అతడి ఇద్దరు సోదరులు కూడా ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పయినట్లు తెలిపింది. వీరు కూడా పలు దాడుల్లో నిందితులని తెలిపింది. వీరు ముగ్గురూ అక్టోబర్ 7 తరహా దాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలిపింది. ఎడిఎఫ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఒక భద్రతా జవాను సర్జికల్ మాస్క్‌లో రైఫిల్‌ను దాచిపెట్టుకుని ఒక చేతిలో పట్టుకొని, మరో చేతిలో మడిచిపెట్టిన వీల్‌చైర్ తీసుకెళ్తున్నట్లు ఉంది. మరో వీడియోలో ఐడిఎఫ్ కమాండోలు ఒక వ్యక్తిని చేతులు పైకెత్తి ఉండగా గోడకు అదిమిపెట్టి ఉన్న దృశ్యాలు ఉన్నాయి.