Wednesday, January 22, 2025

అల్‌షిఫా ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

దాదాపు రెండు వారాల దాడి తరువాత గాజా లోని అల్ ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ తన సైనిక దళాలను సోమవారం ఉదయం ఉపసంహరించుకుంది. అనేక మందిని బలిగొనడమే కాక, భారీ విధ్వంసం జరిగిందని పాలసీనియన్లు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం గత ఆరు నెలల యుద్ధంలో ఈ దాడి అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌గా చెప్పుకుంది. అనేక మంది హమాస్‌లను, ఇతర ఉగ్రవాదులను హతమార్చామని, ఆయుధాలను, అత్యంత విలువైన రహస్య సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ ఈ దాడి పెను విధ్వంసాన్ని మిగిల్చిందని ఆక్షేపించింది. అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని, ఇంకా చాలా మంది ప్రమాదంలో ఉన్నారని పేర్కొంది. ఇప్పటికే ఆస్పత్రి పనిచేయకపోగా ఈ దాడులతో మరింత విధ్వంసం సంభవించిందని వ్యాఖ్యానించింది.

హమాస్, చిన్నపాటి ఇస్లామిక్ జీహాద్ గ్రూపు ఆస్పత్రిలో తమ ప్రధాన కేంద్రాన్ని నిర్వహించారని ఇజ్రాయెల్ అగ్రస్థాయి మిలిటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి వివరించారు. ఆస్పత్రి లోని భవనాల్లో యుద్ధం సాగడానికి హమాస్ కారణమని ఆరోపించారు. కొంతమంది పోరాడే వర్గాలు ఆస్పత్రిలో తమకు తామే వార్డుల్లో బారికేడ్లు అడ్డుగా పెట్టుకుని పోరు సాగించగా, మిగతా వారు ఆస్పత్రి ఆవరణలో మోర్టార్లతో పోరు సాగించారని చెప్పారు. ఇజ్రాయెల్ దళాల వల్ల పౌరులు ఎవరికీ ఎలాంటి ముప్పు జరగలేదన్నారు. ఆస్పత్రి లోని మొత్తం 300 నుంచి 350 మంది వరకు రోగులుండగా, వారిలో 200 మందిని ఆర్మీ ఖాళీ చేయించిందని చెప్పారు. మిగతా రోగులకు ఆహారం, నీరు అందించామని తెలిపారు. ఈ దాడుల్లో 500 మంది కన్నా హమాస్‌లతో పాటు అనుమానిత ఉగ్రవాదులు 900 మందిని అరెస్ట్ చేయడమైందని, వివిధ రకాల కరెన్సీలను 3 మిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకోగలిగామని చెప్పారు.

పాలస్తీనియన్లలో ఒకరైన మొహమ్మద్ మహ్‌దీ ఆస్పత్రిలో అనేక భవనాలు దగ్ధమయ్యాయని, లోపల రెండు , బయట ఆరు మృతదేహాలను గుర్తించామని తెలియజేశారు. మరో పాలస్తీనా నివాసి యాహియా అబు అయుఎఫ్ మాట్లాడుతూ ఆస్పత్రి నుంచి అనేక మంది రోగులను సమీపాన గల అహ్లీ ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఇంకా అల్‌షిఫా ఆస్పత్రిలో రోగులు, వైద్య సిబ్బంది, నిర్వాసితులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో తాత్కాలిక శ్మశాన వాటిక ఏర్పాటు చేయడానికి ఆర్మీ బుల్‌డోజర్లు మట్టిని తవ్వుతున్నాయని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమణ ఇక్కడి జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News