రచ్చ గెలిచి రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు రానురాను ఇంటిపోరు ఎక్కువవుతోంది. అర్థంపర్థంలేని డిమాండ్లతో కొంతకాలంగా హమాస్‌తో సంధియత్నాలకు నెతన్యాహు మోకాలడ్డుతున్నారు. చర్చల విషయంలో హమాస్ ఒక మెట్టు దిగివచ్చినా, నెతన్యాహు మాత్రం మొండివైఖరితో చర్చల ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారు. ఇదే విషయాన్ని మిత్రదేశమైన అమెరికా సైతం అంగీకరించడం తాజా పరిణామం. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకుండా అడ్డుపడుతున్నది నెతన్యాహుయేనా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు అవునని చెప్పక తప్పింది కాదు.
స్వదేశంలోనే నెతన్యాహుపై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో అమెరికా ముసుగులో గుద్దులాటకు స్వస్తి పలికి మిత్రదేశం మొండివైఖరిని పరోక్షంగానైనా అంగీకరించినందుకు అగ్రరాజ్యాన్ని అభినందించాల్సిందే. దీనికితోడు ఇజ్రాయెల్‌కు చేరవేస్తున్న 350 రకాల ఆయుధాల జాబితా నుంచి కీలకమైన 35 ఆయుధాలను తప్పిస్తూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయంతో ఇజ్రాయెల్‌కు పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లుగా అయింది. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ పన్నెండు వందలమందికి పైగా పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా తీసుకువెళ్లింది. వీరిలో వందమందిని ఆ తర్వాత వదిలిపెట్టినా మరో వందమందికి పైగా ఇప్పటికీ హమాస్ చెరలోనే మగ్గుతున్నారు.
వారిని వదిలిపెట్టనిదే గాజాపై యుద్ధం ఆపబోమని ఇజ్రాయెల్ తెగేసి చెబుతుండగా, గాజానుంచి శత్రుసైన్యం పూర్తిగా వైదొలగాలన్నది హమాస్ ప్రధాన షరతులలో ఒకటి. అయితే బందీలను విడిపించడం కంటే తన అధికారాన్ని నిలుపుకోవడమే ప్రధాని నెతన్యాహుకు ముఖ్యమైపోయిందంటూ బందీల బంధువులు కొంతకాలంగా విరుచుకుపడుతున్నారు. అయినా నెతన్యాహు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లనే చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆరుగురు బందీలను హమాస్ హతమార్చడంతో ఇజ్రాయెల్‌లో నిరసనలు భగ్గుమన్నాయి. దేశప్రధాని వైఖరికి నిరసనగా కార్మిక సంఘం హిస్టాడ్రుట్ ఇచ్చిన సార్వత్రిక సమ్మెకు భారీయెత్తున స్పందన లభించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి, బందీలను సురక్షితంగా వెనక్కు రప్పించాలని కోరుతూ లక్షల సంఖ్యలో నిరసనకారులు టెల్ అవీవ్, జెరూసలెం నగరాల్లో వీధులకెక్కి ప్రదర్శనలు జరిపారు. ప్రతిపక్ష నేతలు, సామాన్య జనంతోపాటు ప్రభుత్వోద్యోగులు కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
నెలల తరబడి సాగుతున్న యుద్ధానికి ఇకనైనా చరమగీతం పాడాలంటూ దేశవ్యాప్తంగా అందరూ కోరుతున్నా చర్చలను ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ఇచ్చగించడం లేదో తెలియడం లేదంటూ బందీల బంధువులు చేస్తున్న వ్యాఖ్యలు అర్థం చేసుకోదగినవే. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడేందుకు అంగీకరిస్తూ హమాస్ జులైలో ఒక అడుగు ముందుకు వేసింది. హమాస్ షరతులేమిటో బయటి ప్రపంచానికి వెల్లడించకపోయినా, యుద్ధానికి పూర్తిగా స్వస్తి పలికి ఇజ్రాయెల్ దళాలు వెనుతిరగాలన్న తమ డిమాండ్‌ను ఉగ్రవాద సంస్థ కొంతమేరకు సడలించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హమాస్- ఇజ్రాయెల్ మధ్య ఫిలడెల్ఫి కారిడార్ కీలకంగా మారింది. ఈజిప్టు- గాజా స్ట్రిప్ దక్షిణ సరిహద్దుల వద్ద ఉన్న ఈ కారిడార్‌లోని అనేక సొరంగాల ద్వారా హమాస్ ఆయుధ సామగ్రిని, మందుగుండును గాజాకు రహస్యంగా చేరవేస్తోందన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. హమాస్ ఉగ్రవాదులకు ఈ కారిడార్ ప్రాణవాయువులా ఉపయోగపడుతోందన్న నెతన్యాహు, ఇజ్రాయెల్ సేనలను అక్కడినుంచి వెనక్కు రప్పించేందుకు ససేమిరా అంటున్నారు.
ఇజ్రాయెల్ మంత్రివర్గంలో రక్షణ మంత్రితోపాటు మరికొందరు ఈ కారిడార్ నుంచి సేనలను వెనక్కి రప్పించి, చర్చలలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించాలని కోరుతున్నారు. అయినప్పటికీ మొండిపట్టు వీడనంటున్న నెతన్యాహు వైఖరి మిత్రదేశమైన అమెరికాకు సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. అయినా నెతన్యాహు వెరవకపోగా తనకు ఎవరూ పాఠాలు నేర్పక్కరలేదనీ, బందీల విడుదలకోసం జరుగుతున్న ప్రయత్నాలలో తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని ఖరాఖండిగా చెప్పడం ఆయన మొండివైఖరికి నిదర్శనం. పదకొండు నెలలుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దమనకాండలో 40 వేల మందికి పైగా గాజావాసులు చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ మారణకాండను ఆపే దిశగా నెతన్యాహును దారికి తేవడం ఒక్క అమెరికాకే సాధ్యమనేది ఇజ్రాయెల్ వాసులలో అత్యధికుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు చాలా దగ్గరలో ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన తాజా వ్యాఖ్యలు బందీల బంధువుల ఆశలకు ఊపిరులూదుతోంది.