పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఈ నెల 23న మరో పాచిక విసిరారు. స్వతంత్ర పాలస్తీనాకు గాని, పాలస్తీనా, ఇజ్రాయెల్ అనే రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి గాని తాను బద్ధ విరోధినని ఇప్పటికే స్పష్టంగా సూచిస్తూ వచ్చిన ఆయన, గాజాపై ప్రస్తుత యుద్ధం ముగిసిన తర్వాత అక్కడి పౌర పరిపాలన, భద్రత వ్యవహారాలు కూడా పూర్తిగా తమ ఆధీనంలోనే వుండగలవని కొత్త ప్రతిపాదన చేస్తూ ఒక పత్రాన్ని తమ మంత్రి వర్గం ముందుంచారు. ఆయన మంత్రివర్గంలో పలువురు తనకు తీసిపోని తీవ్ర జాతివాదులు అయినందున, ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించగలదని వేరే చెప్పనక్కర లేదు. ఒకవేళ అది ఆచరణకు వస్తే ఆ తర్వాత, 1948 నుంచి 76 సంవత్సరాలుగా కొనసాగుతున్న పాలస్తీనా సమస్య సరికొత్త మలుపు తీసుకోగలదని భావించవచ్చు.
ఈ మాట అనుకున్నప్పుడు రెండు సందేహాలు తలెత్తుతాయి. నెతన్యాహూ ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదించినా అది ఆచరణ సాధ్యమా అన్నది మొదటిది. అందుకు అమెరికా అంగీకరిస్తుందా అనేది రెండు. గాజాలో పాలస్తీనియన్లు ఎన్నికలు జరుపుకుని తమ పరిపాలనా వ్యవస్థలను తాము ఏర్పాటు చేసుకోకుండా ఆపాలని, ఇజ్రాయెల్ ప్రభుత్వమే కొందరు స్థానికులను ఎంపిక చేసి వారి ద్వారా కీలు బొమ్మ పాలన సాగించాలని, భద్రతా వ్యవహారాలు కూడా తమ చేతిలోకే తెచ్చుకోవాలని లోగడ కూడా ప్రయత్నాలు జరిగాయి. 1967లో ఇజ్రాయెల్‌కు, అరబ్ దేశాలకు మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచిన తర్వాత, ఇటువంటి ప్రయత్నాలు 1970లలో ఒకసారి, 1980లలో మరొకసారి జరిగాయి. కాని పాలస్తీనియన్ల తీవ్ర వ్యతిరేకతలు, పోరాటాల వల్ల అవి నెరవేరలేదు.
అయితే అప్పటికన్న ఇప్పుడు పరిస్థితులు తమకు అనుకూలంగా మారినట్లు ఇజ్రాయెల్ నమ్ముతున్నట్లు కనిపిస్తున్నది. గత అక్టోబర్ 7న తమ పౌరులపై హమాస్ జరిపిన దాడిని సాకుగా చేసుకుని ఆ మిలిటెంట్లనే గాక మొత్తం పాలస్తీనియన్ జాతినే నిర్మూలించే దిశగా మారణకాండను సాగిస్తున్న నెతన్యాహూ ప్రభుత్వం, మొత్తం ప్రపంచం వ్యతిరేకించినా సరే తన సైనిక బలంతో ఆ దారుణాన్ని సాగిస్తూ ఇప్పటికే సుమారు 30,000 మంది ప్రాణాలు తీసింది. ఇందుకు వ్యతిరేకంగా జనవరి 26న ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయడం లేదు. న్యాయస్థానం గాని, ప్రపంచ దేశాలు గాని ఖండించినా లెక్క చేయబోమని నెతన్యాహూ బాహాటంగా ప్రకటిస్తున్నారు. తమ లక్షం నెరవేరే వరకు యుద్ధం ఆపే ప్రసక్తి లేదంటున్నారు. ఇప్పటికే ఉత్తర గాజా నుంచి పాలస్తీనా ప్రజలను తరిమివేసిన ఆయన, ప్రస్తుతం దక్షిణ భాగంలోనూ అదే పని చేస్తున్నారు. ఇటువంటిది 1970లో, 80లలో జరగని పని. కనుక ఈసారి తమ పథకం నెరవేరగలదన్నది తన అంచనా అయినట్లు తోస్తున్నది.
ఇకపోతే, అమెరికా అంగీకరించగలదా అనేది రెండవ సందేహం. నిజానికి అమెరికా కపట నీతిని మొదటి నుంచి గమనిస్తున్న వారికి, ఇందుకు వారు అంగీకరించగలరా అనే సందేహమే తలెత్తదు. నెతన్యాహూ తాజా ప్రతిపాదనపై వారి వైఖరినే చూడండి. యుద్ధం ముగిసినాక గాజాకు, వెస్ట్ బ్యాంక్‌కు కలిపి ఎన్నికలు జరిగి కొత్త పాలస్తీనా ప్రభుత్వం ఏర్పడి స్థిరపడినాక అపుడు రెండు స్వతంత్ర దేశాలన్నది తమ ఆలోచన అట. అందుకు నెతన్యాహూ పథకం భంగకరం గనుక దానికి తాము వ్యతిరేకమట. ఇటువంటి పరిష్కారం కోసమంటూ అమెరికా నాయకత్వాన ఓస్లో ఒప్పందాలు జరిగి 30 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలంలో ఇజ్రాయెల్ అందుకు ఎన్ని ఆటంకాలు కల్పించినా, మొదట అరాఫాత్ ప్రభుత్వాన్ని ఎంత నిర్వీర్యం చేసి ఆ తర్వాత మహమూద్ అబ్బాస్ ప్రభుత్వాన్ని ఎంత పనికిమాలిన దిగా మార్చినా, వెస్ట్ బ్యాంక్‌లో చట్ట విరుద్ధమైన యూదు సెటిలర్లను క్రమంగా ఏడు లక్షలకు పెంచుతూ పోయినా, తాజాగా మరో మూడు వేల కుటుంబాలను సెటిల్ చేయజూస్తున్నా, అటు వెస్ట్ బ్యాంక్‌లో, ఇటు గాజాలో అనునిత్యం అతి తీవ్రమైన నిర్బంధాలు, కాల్చి చంపటాలు సాగిస్తునా, ఎప్పుడో ఒకసారి చిన్న మొక్కుబడి మాట తప్ప, అమెరికన్లు ఇజ్రాయెల్‌ను నిరోధించింది ఎప్పుడూ లేదు.
పైగా వారి అణచివేత చర్యల కోసం ఆర్థిక సహాయం, ఆయుధ సరఫరా చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న యుద్ధంలోనూ అది ఆగలేదు. మరొక వైపు ఐక్యరాజ్య సమితిలో, ఇతర అంతర్జాతీయ వేదికలపైన ఇజ్రాయెల్‌కు వీటో ద్వారా, ఇతరత్రా నాటో కూటమితో పాటు నేటికీ అండగా నిలుస్తున్నారు. సమస్య పరిష్కారానికి తాము ఘనమైన మార్గాలేవో కనుకొని అమలు పరచ చూస్తుండగా, ఇతరులు అందుకు భంగం కలిగిస్తున్నారంటూ లజ్జ, నీతిలేని మాటలు మాట్లాడుతున్నారు. వారికి కావలసింది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల పరిరక్షణ, అమెరికాలోని మహా శక్తివంతమైన యూదు లాబీలకు లాభం చేయడం మాత్రమే.
పాలస్తీనాకు చిరకాలంగా ఎదురవుతున్న సమస్య మరొకటి వుంది. అది సాటి అరబ్ దేశాలకు తమ పట్ల చిత్తశుద్ధిలేకపోడం. వారు ఇజ్రాయెల్‌పై 1967లో చేసిన ఉమ్మడి యుద్ధాన్ని మినహాయిస్తే, తర్వాతి కాలమంతా స్వప్రయోజనాల కోసం కొంత, తమ బలహీనతల కారణంగా కొంత, అమెరికాకు లొంగిపోయి, ఇజ్రాయెల్‌కు భయపడి జీవిస్తున్నారు.
ఇజ్రాయెల్‌పై తిరిగి యుద్ధాలు చేయలేకపోయినా కనీసం పాలస్తీనా పట్ల చిత్తశుద్ధితో సంఘీభావం చూపుతూ చేయగలిగింది ఎంతైనా వుంది. అందుకు బదులు పాలస్తీనాను విస్మరించి, అమెరికా దౌత్యనీతికి లొంగిపోయి, ఒక్కరొక్కరుగా ఇజ్రాయెల్‌తో బంధాలను పెనవేసుకుంటున్నారు. ప్రస్తుత గాజా యుద్ధం మొదలైన తర్వాత అమెరికన్ దౌత్యవేత్తలు వారానికి రెండు సార్లు పశ్చిమాసియాలో పర్యటిస్తూ, అరబ్ నాయకులలో ఎటువంటి నిరసనలు లేకుండా తేలికగా మచ్చిన చేయగలుగుతున్నారు. సాధారణ ప్రజలలో అక్కడనే గాక పాశ్చాత్య దేశాలలోనూ నిరసనలు పెల్లుబుకుతున్నా ఎవరూ లెక్క చేయకపోవటమే గాక నిరసనకారులపైనే నిర్బంధాలు విధిస్తున్నారు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఇరాన్ ఒక్కటి తీవ్ర వైఖరి తీసుకొని హౌతీ, హిజ్బుల్లా వంటి మిలిటెంట్ సంస్థల ఇజ్రాయెల్ వ్యతిరేక దాడులకు తోడ్పడుతున్నది.
దక్షిణాఫ్రికా ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకుపోయి అనుకూలమైన తీర్పును సాధించగా, పలు ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, ఏషియన్ దేశాలు బలమైన నిరసనలు ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో భారత దేశం లేకపోవడం విషాదం. మొత్తం మీద ఇటువంటి పరిస్థితులన్నింటి మధ్య ఇప్పుడు నెతన్యాహూ కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. 1970, 80లతో పోల్చినప్పుడు కొంత మారిన పరిస్థితులలో ఈసారి అది నెరవేరవచ్చునా అన్నది గమనించవలసిన విషయం. అది నెరవేరే ప్రసక్తి లేదని హమాస్ మాత్రమే గాక, వెస్ట్ బ్యాంక్‌లో అబ్బాస్ నాయకత్వాన నడుస్తున్న అమెరికా ఇజ్రాయెల్‌ల కీలు బొమ్మ ప్రభుత్వం కూడా ప్రకటించనైతే ప్రకటించింది. ఇపుడు జరగవలసింది తక్కిన ప్రపంచ దేశాలు, ప్రపంచ జనాభిప్రాయం, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు పాలస్తీనాకు తమ మద్దతును మరింత పెంచుతూ అమెరికన్ శిబిరాన్ని, ఇజ్రాయెల్‌ను మరింత వత్తిడికి గురి చేయడమే.
టంకశాల అశోక్
9848191767