ఖాన్ యూనిస్: దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయల్ బాంబుల వర్షం కురిపించింది. స్థానిక ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోవాలని సోమవారం హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఐడీఎఫ్ తుపాకుల మోత మోగించింది. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలిపారు. 50 మందికి పైగా సామాన్య ప్రజలకు గాయాలైనట్టు పేర్కొన్నారు.
ఖాన్ యూనిస్ నుంచి ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు దిగారని, అందుకే ప్రతిదాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. ఖాన్ యూనిస్ లోని నిస్సార్ ఆస్పత్రిలో ఉగ్రవాదులు ఉన్నారని పసిగట్టిన ఇజ్రాయెల్ సేనలు సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత అక్కడికి చేరుకున్నాయి. ఖాళీ చేయాలని ముందే హెచ్చరించినందున కాల్పులకు దిగాయి. అప్పటికే చాలావరకు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రక్రియ చివరి దశలో ఉండగానే సైన్యం బాంబుదాడులు చేసిందని నిస్సార్ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు.