గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 18 మంది వ్యక్తులు హతులు కాగా, ఒక ఆసుపత్రి సముదాయం లోపల నిర్వాసిత పాలస్తీనియన్ల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రయం పొందుతున్ననలుగురు కూడా వారిలో ఉన్నారు. ఒక టెల్ అవీవ్ శివారు ప్రాంతంలో పాలస్తీనియన్లు సాగించిన కత్తిపోట్లకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. గాజాలో సుమారు 10 నెలలుగా సాగుతున్న యుద్ధం, లెబనాన్, ఇరాన్‌లలో క్రితం వారం వేర్వేరు దాడుల్లో ఇద్దరు సీనియర్ తీవ్రవాదులు హతం కావడం దరిమిలా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి. ఆ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని మిత్ర పక్షాలు బెదరింపులకు దిగగా మరింత విధ్వంసకర రీతిలో ప్రాంతీయ యుద్ధం సాగవచ్చుననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
కత్తిపోట్ల దాడిలో 70 ఏళ్లు దాటిన ఒక మహిళ, 80 ఏళ్ల పురుషుడు మరణించినట్లు, మరి ఇద్దరు గాయపడినట్లు ఇజ్రాయెల్ మగెన్ దేవిడ్ ఆడమ్ రక్షణ విభాగం, సమీపంలోని ఒక ఆసుపత్రి తెలియజేశాయి. ఒక పాలస్తీనియన్ తీవ్రవాది ఆ దాడి జరిపినట్లు, అతనిని ‘వధించినట్లు’ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు మూడు వేర్వేరు ప్రాంతాల్లో కనిపించినట్లు రక్షణ కార్యకర్తలు తెలియజేశారు. క్రితం వారం ఇరాన్ రాజధానిలో దాడిలో ఒక హమాస్ అగ్రశ్రేణి రాజకీయ నేత, లెబనాన్‌లో దాడిలో ఒక హెజ్బొల్లా సీనియర్ కమాండర్ హతమైన తరువాత ప్రతీకార దాడులు జరగవచ్చునని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఆ రెండు హత్యలు గాజాలో ప్రస్తుతం సాగుతున్న యుద్ధంతో ముడిపడినవే.