కొప్పల్ (కర్నాటక) : హంపి సమీపంలో ఒక కాలువ ఒడ్డున కూర్చొని ఆకాశంలో నక్షత్రాలను వీక్షిస్తున్న 27 ఏళ్ల ఇజ్రాయెలీ టూరిస్టు సహా ఇద్దరు మహిళలపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారని, దౌర్జన్యం చేశారని పోలీసులు శనివారం వెల్లడించారు. ఆ మహిళల వెంట ఉన్న ముగ్గురు పురుష పర్యాటకులపై కూడా దౌర్జన్యం చేసి, వారిని కాలువలోకి తోశారని, వారిలో ఒకరు విగతజీవిగా కనిపించారని పోలీసులు తెలియజేశారు. ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, కానీ, గుర్తించిన ముగ్గురు అనుమానితుల పట్టివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.
ఈ ఘటన గురువారం రాత్రి సుమారు 11 గంటలకు చోటు చేసుకున్నది. రాత్రి భోజనం అనంతరం 29 ఏళ్ల అతిథిగృహం యజమానురాలు ఇజ్రాయెలీ టూరిస్టు, ముగ్గురు పురుష టూరిస్టులతో కలసి సనాపూర్ సరస్సు సమీపాన తుంగభద్ర కాలువ ఎడమ ఒడ్డున కూర్చొని, గిటార్ వాయిస్తూ, సంగీతం ఆస్వాదిస్తూ, నక్షత్రాలను వీక్షిస్తున్నారని పోలీసులు తెలియజేశారు. పురుష టూరిస్టుల్లో ఒకరు యుఎస్‌కు చెందిన వ్యక్తి కాగా,ఇతరులు ఒడిశా, మహారాష్ట్రలకు చెందినవారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం, తాము నక్షత్రాలను వీక్షిస్తూ, సంగీతం ఆస్వాదిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్‌సైకిల్‌పై తమ వద్దకు వచ్చి పెట్రోల్ ఎక్కడ లభిస్తుందని అడిగారని, దగ్గరలో పెట్రోల్ బంకులు ఏవీ లేవని తాను చెప్పి, సనాపూర్‌లో పెట్రోల్ దొరుకుతుందని సూచించానని, నిందితులు రూ. 100 డిమాండ్ చేశారని అతిథి గృహ యజమానురాలు తన ఫిర్యాదులో తెలియజేశారు.
‘అతిథి గృహ యజమానురాలికి వారు ఎవరో తెలియనందున తమ వద్ద డబ్బు లేదని ఆమె వారితోచెప్పింది. కానీ వారు పదే పదే అడిగినప్పుడు ఒడిశా నుంచి వచ్చిన టూరిస్ట్ వారికి రూ. 20 ఇచ్చారు. ఆ తరువాత ఆ ముగ్గురు వ్యక్తులు వాదించసాగారు. టూరిస్టుల తలలపై రాళ్లతో కొడతామని బెదరించారు’ అని ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదీ తెలిపారు. ఆ బృందం మరింత డబ్బు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు కన్నడం, తెలుగు మాట్లాడిన దుండగులు వారిని దుర్భాషలాడసాగారని, వారు ఆ తరువత అతిథి గృహ యజమానురాలిపైన, ఇజ్రాయెలీ టూరిస్టుపైప అత్యాచారం చేసి, ముగ్గురు పురుష టూరిస్టులను కాలువలోకి నెట్టారని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు, ‘దుండగుల్లో ఇద్దరు అతిథిగృహ యజమానురాలిని కొట్టగా, మూడవ దుండగీడు ముగ్గురు పురుష టూరిస్టులను కాలువలోకి బలంగా తోసివేశారు.
ముగ్గురు దుండగులు అతిథిగృహ యజమానురాలని కొట్టగా ఆమె తీవ్రంగా గాయపడింది’ అని ఎఫ్‌ఐఆర్ వివరించింది. దుండగులు ఆమెను కాలువ పక్కకు లాగగా, వారిలో ఒకడు ఆమె గొంతు నులిమి, దుస్తులు తొలగించాడని, వారిలో ఇద్దరు ఆమెను కొట్టి అత్యాచారం చేశారని, వారు ఆమె బ్యాగును కూడా లాక్కొని రెండు మొబైల్ ఫోన్లను. రూ. 9500 నగదును తస్కరించారని ఎఫ్‌ఐఆర్ తెలిపింది. అదే విధంగా వారిలో ఒకడు ఇజ్రాయెలీ టూరిస్టును లాక్కొని వెళ్లి అత్యాచారం చేశాడు. దుండగులు ఆ దాడి తరువాత మోటార్‌సైకిల్‌పై పరారయ్యారని ఫిర్యాదీ ఆరోపించారు.
ముగ్గురు పురుష టూరిస్టుల్లో ఇద్దరు గాయపడగా, మూడవ టూరిస్టు గల్లంతయ్యాడని, అతని మృతదేహం శనివారం ఉదయం దొరికిందని పోలీసులు తెలియజేశారు. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత కింద దోపిడీ, దొంగతనం లేదా మరణాన్ని కలిగించే లేదా తీవ్రంగా గాయపరిచే ఉద్దేశంతో దోపిడీ, సామూహిక అత్యాచారం. హత్యా యత్నం సెక్షన్ల కింద గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలకు ఒక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ‘మేము కేసు నమోదు చేసి, అనుమానితులను గుర్తించాం. ఆరు బృందాలు ఏర్పాటయ్యాయి. వారిని పట్టుకునేందుకు యత్నాలు సాగుతున్నాయి’ అని పోలీసులు తెలిపారు.