Wednesday, January 22, 2025

గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు

- Advertisement -
- Advertisement -

గాజా: హమాస్ మిలిటెంట్ల అధీనంలో ఉన్న గాజా నగరాన్ని నాలుగు వైపులనుంచి చుట్ట్టుముట్టినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఏ క్షణమైనా నగరంపై అన్ని వైపులనుంచి భూతల దాడులు జరుపుతామన్న సంకేతాలను ఇచ్చింది. అలాంటిదేమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హమాస్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. మరో వైపు గురువారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన సబ్రా టెల్ అలహవా బెటాలియన్ కమాండర్ ముస్తఫా దల్లౌల్ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలో ఐడిఎఫ్ బలగాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో దల్లౌల్ కీలక పాత్ర పోషించినట్లు ఐడిఎఫ్ దళాలు ప్రకటించాయి. గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం నాలుగు వైపులా చుట్టు ముట్టినటు ్లఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి డేనియల్ హగారి స్వయంగా ప్రకటించారు.

తాము సిద్ధంగా ఉన్నామని, భూతల దాడులు జరిపేందుకు సైన్యంనుంచి అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. మరో వైపు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటనకు హమాస్ కౌంటర్ ఇచ్చింది. గాజా నగరంలోకి ఇజ్రాయెల్ సైనికులు అడుగుపెడితే శవాలుగానే తిరిగి వెళతారని హెచ్చరించింది. కాగా గాజా ప్రాంతంలో గురువారం రాత్రి జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున అసాల్ట్ రైఫిల్స్, మిషన్ గన్స్, గ్రెనేడ్లు, పేలుడు పరికరాలు, ఆర్‌పిజిలు, మందుగుండుతో పాటుగా ఇంటెలిజన్స్ సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరో వైపు హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న వారి కోసం అమెరికా డ్రోన్ల సాయంతో గాలింపులు జరుపుతోంది.ఇదిలా ఉండగా శుక్రవారం ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో వ్యక్తిగతంగా సమావేశమ్యారు.

ఇజ్రాయెల్ బయలుదేరే ముందు బ్లింకెన్ విలేఖరులతో మాట్లాడుతూ గాజాలో పౌరులకు హానిని వీలయినంత మేర తగ్గించడానికి తీసుకోవలసిన నిర్మాణాత్మక చర్యల గురించి తన పర్యటనలో ఇజ్రాయెల్ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా 9 వేల కు పైగా పాలస్తీనియన్లు మృతి చెందగా 30 వేలకు పైగా గాయపడ్డారు. మృతుల్లో సగం మంది 18 ఏళ్ల లోపు వారేనని హమాస్ ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. గాజాలోని ప్రజలకు మానవతా సాయం నిరాఘాటంటా అందేలా యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించేలా ఇజ్రాయెల్‌ను ఒప్పించాలని అమెరికాపై పలు ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లింకెన్ మరోసారి ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండడం గమనార్హం. ఆయన జోర్డాన్‌కు కూడా వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఈజిప్టుతో పాటుగా పలు ఇస్లాం దేశాల నేతలతో చర్చలు జరపనున్నారు. అయితే నెతన్యాహు మాత్రం హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించే వరకు యుద్ధం కొనసాగిస్తామని ప్రకటిస్తుండడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News