Wednesday, January 22, 2025

అంతులేని గాజా విషాదం

- Advertisement -
- Advertisement -

సకల మానవాళి కళ్ళప్పగించి చూస్తుండగా ఇజ్రాయెల్ సేనలు గాజాలో సాగిస్తున్న నరమేధం ప్రపంచంలో అశాంతిని, ప్రాబల్య శక్తుల హింసోన్మాదాన్ని ఆపే శక్తి లేనేలేదని, పరస్పరం కలహించుకొని ఒకరి మీద మరొకరు పగ సాధించుకోడం పట్ల ఉన్న ఆసక్తి శాంతిని నెలకొల్పడం మీద ఎవరికీ లేదని రూఢి చేస్తున్నది. అత్యవసర మానవతా సాయం కోసం కాల్పులు ఆపాలని కోరుతూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానా న్ని అమెరికా వీటో చేసిన తర్వాత గాజాలోని పాలస్తీ నీయులపై దాడులు ముమ్మ రమైనట్టు వార్తలు చెబుతున్నాయి. అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ బలగాలు చేసిన దాడిలో 1200 మంది చనిపోగా గాజాపై ప్రతీకార దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 19000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో మూడింట రెండొంతుల మంది మహిళలు పసిపిల్లలే. గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా నష్టాలను చవి చూస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ యుద్ధం కొనసాగేకొద్దీ హమాస్‌కు పాలస్తీనియన్ల మద్దతు పెరుగుతున్నది. 90శాతం మంది హమాస్ కు అనుకూలంగా ఉన్నట్టు తాజా సర్వేలు చెబుతున్నాయి.

అదే సందర్భంలో జోర్డాన్ నది పశ్చిమ తీర పాలస్తీనాను పాలిస్తున్న పాలస్తీనా అథారిటీ, దాని పాలకుడు అబ్బాస్ పునాదులు కదిలిపోతున్నట్టు, ఆయన పాలస్తీనియన్ల మద్దతును పూర్తిగా కోల్పోయినట్టు గత బుధవారం నాడు ఒక పాలస్తీనా సంస్థ జరిపిన సర్వే వెల్లడించింది. అబ్బాస్ అమెరికా ఏజెంట్‌గా మారాడని పాలస్తీనా ప్రజలు నమ్ముతున్నారు. అభిప్రాయ సేకరణలో గాజాలో 57శాతం మంది, పశ్చిమ తీరంలో 82శాతం మంది ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని సమర్ధించడం గమనించ వలసిన విషయం. సర్వేలు కొద్ది మంది మచ్చు అభిప్రాయం మీదనే ఆధార పడతాయి కనుక వాటిని పూర్తిగా నమ్మలేము, కాని అక్కడి ప్రజాభిప్రాయ ధోరణులకు సూచికలుగా వాటిని పరిగణించవచ్చు. గాజాను పాలించడానికి సిద్ధంగా ఉండాలని అబ్బాస్‌కు అమెరికా చెప్పినట్టు సమాచారం. అక్టోబర్ 7 దాడిలో హమాస్ 200మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకొన్నది. ఇజ్రాయెల్ వద్ద వేలాది మంది పాలస్తీనియన్లు ఖైదీలుగా ఉన్నారు. శాంతి చర్చలు జరిగితే వీరి విడుదలను రెండు వైపులవారూ సాధించుకోగలుగుతారు. స్వతంత్ర పాలస్తీనా వైపు మరో ముందడుగు పడుతుంది.

నెతన్యాహు సారధ్యం లోని ఇజ్రాయెల్ మాత్రం చర్చలకు ససేమిరా అంటోంది. అయితే అది ప్రకటించినట్టు హమాస్ నిర్మూలన సాధ్యమా, కానే కాదని నిపుణులు చెబుతున్నారు. గాజాలో హమాస్ భారీ ఎత్తు ఆత్మరక్షణ ఏర్పాట్లు చేసుకొన్నట్టు తెలుస్తున్నది. అనేక మైళ్ల పొడవు భూగర్భ సొరంగాలను తవ్వుకొని, బంకర్లు, వార్‌రూమ్స్‌ను నెలకొల్పుకొన్నట్టు సమాచారం. అలాగే రాకెట్ నిల్వలను పెంచుకొన్నది. అందు చేత ఇజ్రాయెల్ సేనలు నెమ్మదిగా హమాస్ ఉనికి పట్టులను పట్టుకోవాలి గాని మొత్తం గాజా పై విచక్షణ రహిత దాడులు జరపడం దారి కానే కాదని అమెరికన్ రక్షణ నిపుణులే భావిస్తున్నారు. గాజా ప్రపంచంలో అత్యంత జనసాంద్రత గల ప్రాంతం. అక్కడ 22 లక్షలమంది ఉన్నారు. భారీ దాడులవల్ల రక్త పాతమే సంభవిస్తుంది గాని, హమాస్ మిలిటెంట్లు పట్టుబడరు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి సైన్యాధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.హమాస్ రాజీకి సిద్ధంగాలేని కరడుగట్టిన మిలిటంట్ల సంస్థ, ఇజ్రాయెల్ పొడగిట్టని వారితో కూడుకొన్నది.

అక్టోబర్ 7నాటి ఇజ్రాయెల్ ముట్టడి తాడో పేడో తేల్చుకోవాలనే హమాస్ దృఢ నిశ్చయాన్ని చాటింది. అంతే కాదు, ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ లోపాలను కూడా అది బయటపెట్టింది. అందు చేత హమాస్ ను మట్టు బెట్టాలనే అవాస్తవిక సంకల్పాన్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టుకోడమే దానికి శ్రేయస్కరం కాగలదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాలను మళ్ళీ ప్రయోగించి హమాస్ మిలిటంట్ల ను చర్చలకు ఒప్పించాలని అంటున్నారు. ఇటీవలి స్వల్ప కాల కాల్పుల విరమణ ఈ దేశాల చొరవ వల్లనే సుసాధ్యమయ్యింది.1982 లో యాసర్ అరాఫత్ సారధ్యం లోని పాలస్తీనా లిబరేషన్ ఫోర్స్ (పిఎల్‌ఒ)ను బీరూట్ నుంచి టునిసియాకు యెమెన్‌కు పంపివేసిన మాదిరిగా హమాస్ మిలిటెంట్లకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసి దూరాలకు పంపించడమే శరణ్యమని అంటున్నారు. అయితే అది ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. చిరకాలంగా మారణ హోమాలు సృష్టిస్తూ మానవత ఉనికిని ప్రశ్నిస్తున్న ఈ సమస్యకు రెండు ఇరుగు పొరుగు దేశాల ఏర్పాటుతో పరిష్కారం సాధించడం ఒక్కటే మార్గం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News