జెరూసలెం: ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు మిలిటెంట్లతోసహా మొత్తం ఐదుగురు పాలస్తీనియన్లను మట్టుబెట్టాయి. దీంతో గాజాలో ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతంలో హింస మరింత చెలరేగింది. అక్టోబర్ 7న గాజా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుండి వెస్ట్‌బ్యాంక్‌లో హింస కారణంగా పాలస్తీనియన్ల హత్యల సంఖ్య 205 కు పెరిగింది. హమాస్‌ను అంతమొందించడమే తమ లక్షంగా చెబుతున్న ఇజ్రాయెల్ గాజాలో పాలకవర్గం, ఇతర మిలిటెంట్ గ్రూపులు వెస్ట్‌బ్యాంకులో చురుకుగా సాగుతున్నాయని ఆరోపించింది. కానీ హక్కుల సంఘాలు ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్నాయి. ఇళ్లను కూల్చివేయడం, అరెస్టులు చేయడం, జోరుగా సాగుతున్నాయని పేర్కొంటున్నాయి.
తాజాగా గురువారం రాత్రి ఇజ్రాయెల్ మిలిటరీ ట్రక్కులు, బుల్‌డోజర్లు, జెనిన్ శరణార్థుల శిబిరం లోకి చొచ్చుకు వచ్చి అనేక భవనాలపై దాడులు చేయడానికి గురి పెట్టాయని స్థానిక జర్నలిస్టులు వెల్లడించారు. ఒకానొక ప్రదేశంలో ఇజ్రాయెల్ దళాలపై బాంబుల దాడికి పాల్పడిన మిలిటెంట్లను ఇజ్రాయెల్ వైమానిక దళాలు లక్షంగా చేసుకున్నాయి. కనీసం 15 మంది గాయపడగా వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందని పాలస్తీనా ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాల చొరబాటుతో వైద్యసాయం సరిగ్గా అందడం లేదు.