పోలీస్, భద్రతా సంస్ధల దర్యాప్తు
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ను, ఆయన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ బులెట్‌తో కూడిన లేఖ రావడంతో ఇజ్రాయెల్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపుపై ఇజ్రాయెల్ పోలీస్, అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ ఉమ్మడిగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు చెప్పారు. ఈ లేఖ బెనెట్ నివాస గృహానికి కానీ, జెరూసలెం లోని బెనెట్ అధికారిక నివాసానికి కానీ పంపలేదు. బెనెట్ భార్య గిలట్ బెనెట్ ఇదివరకు పనిచేసే ప్రదేశానికి పంపడమైందని ఇజ్రాయెల్ వార్తాపత్రిక కథనం వెలువడింది. ప్రధాని దంపతుల 16 ఏళ్ల కుమారుడు యోనీని కూడా ఈ లేఖలో ప్రస్తావించడమైంది. ఆగంతకులు మేం మీవద్దకు వస్తాం అని లేఖలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే బెదిరింపుల కన్నా ఈ బెదిరింపు లేఖకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బెనెట్ ఒక ప్రకటన చేస్తూ రాజకీయ వివాదం ఎంతతీవ్రమైనా హింసకు, చంపుతామన్న బెదిరింపులకు దారి తీయకూడదని పేర్కొన్నారు.