టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసి గాజాకు తీసుకు వెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడీఎఫ్ ( ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ) హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దళాల ప్రతినిధి రిచర్డ్ మాట్లాడుతూ “ బందీలుగా ఉన్నవారిలో ఒక్క వృద్ధురాలికైనా, ఒక్క పసికందుకైనా, వారు హాని చేస్తే … అది హమాస్ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
ఈ విషయం వారికీ తెలుసు” అని హెచ్చరించారు. అంతేకాదు… తాము ఎటువంటి హెచ్చరికలు లేకుండా బాంబింగ్ చేయబోమని వెల్లడించారు. ఐడీఎఫ్ దాడికి ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లేదా వార్నింగ్ షాట్స్ పేల్చి హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. సామాన్య ప్రజలు కూడా ఆ ప్రదేశాల నుంచి వెళ్లి పోవాలని సూచిస్తామన్నారు. గాజా లోని పౌర, ప్రభుత్వ , సైనిక భవనాలను ఇజ్రాయెల్ దళాలు గుర్తించి దాడి చేస్తున్నాయా? అన్న ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి స్పందిస్తూ “ అక్కడ ప్రజలు ఉండే భవనాల్లోనే ఆయుధాలు ఉంచడంతోపాటు హమాస్ నాయకులు కూడా దాక్కొంటున్నారు” అని రిచర్డ్ వెల్లడించారు.
మరో వైపు ఇజ్రాయెల్ దళాలు పూర్తి స్థాయిలో గాజాపై నియంత్రణ సాధించే దిశగా అడుగు వేయడంతో హమాస్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ సంస్థ ప్రతినిధి అబు ఉబైద మాట్లాడుతూ తాము ఇప్పటివరకు ఇస్లాం ప్రకారం బందీలను సురక్షితంగా ఉంచామని తెలిపాడు. అయితే ఇజ్రాయెల్ జరిపై ప్రతి ఒక్క బాంబింగ్‌కు ఓ పౌరుడిని హత్య చేస్తామని హెచ్చరించాడు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాదాపు 3,00,000 మంది సైన్యాన్ని సమీకరించి హమాస్‌పై దాడి చేసేందుకు సిద్ధం చేస్తోంది.
విదేశాల్లో ఉన్న వందల మంది ఇజ్రాయెల్ సైనికులు మాతృభూమికి తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇజ్రాయెల్ 35 బెటాలియన్లను గాజా సరిహద్దులకు తరలించింది. భవిష్యత్తులో ఇక్కడ ఆపరేషన్ల కోసం అవసరమైన బేస్‌లు , వసతులు నిర్మిస్తోంది. గాజాలో భారీగా పదాతిదళం పోరాడాల్సి ఉంటుందని ఆ దేశం విశ్వసిస్తోంది.