ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో గురువారం స్పేడెక్స్ ఉపగ్రహాల డీడాకింగ్ పూర్తయినట్టు ప్రకటించింది. ఈ ఘన విజయం చంద్రుడి అన్వేషణ, మానవ అంతరిక్షయానం, భారత సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణం వంటి ఇస్రో భవిష్యత్తు మిషన్లకు మార్గం సుగమం చేస్తుంది. ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ఇస్రో బృందాన్ని అభినందించారు.
ఇస్రో సాధించిన ఈ ఘనత అద్భుతం అని కొనియాడారు. ఇది ప్రతీ భారతీయుడికి ధైర్యాన్ని ఇస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని పెంచుతుందన్నారు. గత ఏడాది డిసెంబర్ 30న భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో)అంతరిక్షంలో డాకింగ్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీనికోసం ఎస్‌డి ఎక్స్ 01. ఎస్‌డి ఎక్స్ 02అనే రెండు ఉపగ్రహాలను కక్షలోఉంచి , వాటిని అనుసంధానించడానికి (డాకింగ్), మళ్లీ విడివిడిగా చేయడం (డీ డాకింగ్ ) వంటి ప్రయోగాలు నిర్వహించింది. అనేక ప్రయత్నాల తరువాత జనవరి 16 న రెండు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా డాక్ చేయగలిగింది.