Friday, December 20, 2024

విక్రమ్ ల్యాండర్ లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు పూర్తయిన తరువాత చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రాణ స్థితి లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని తిరిగి పనిచేయించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా ఇంకా ఎలాంటి సంకేతాలు రావడం లేదు. అయితే వాటితో సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోడానికి ప్రయత్నాలు సాగుతాయని ఇస్రో శుక్రవారం తెలియజేసింది. వాస్తవానికి చంద్రయాన్ 3 ప్రయోగం లోని ల్యాండర్, రోవర్‌లు 14 రోజులే పనిచేస్తాయి. భూమిపై 14 రోజులంటే జాబిలిపై ఒక పగలుకు సమానం. ఆ తర్వాత సూర్యాస్తమయం కావడంతో రోవర్ ఈ నెల 2న, ల్యాండర్ 4 న నిద్రాణ స్థితిలోకి శాస్త్రవేత్తలు పంపారు.

చంద్రునిపై రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు మైనస్ 120 నుంచి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అంతటి శీతల పరిస్థితుల్లో రోవర్, ల్యాండర్‌లు పనిచేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రోవర్, ల్యాండర్ చంద్రుని దక్షిణ ద్రువం వద్ద ఉన్నాయి. అక్కడ ఇప్పుడు సెప్టెంబర్ 20 నుంచి తిరిగి సూర్యోదయం ప్రారంభమైంది. సెప్టెంబర్ 22 నుంచి సోలార్ ప్యానెళ్లు, ఇతర పరికరాలు పూర్తిగా చార్జి అవుతాయి కాబట్టి పనిచేస్తాయన్న ఆశ కలుగుతోందని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నిలేష్ దేశాయ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వాటిని తిరిగి చైతన్యపర్చి ప్రయోగాలు చేయించాలన్న ప్రయత్నంలో ఇస్రో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News