బెంగళూరు : ఈనెల 28న ప్రయోగించనున్న భారత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి సి 51)అంతరిక్ష నౌక ప్రయోగ రిహార్సల్స్‌ను గురువారం ఇస్రో పూర్తి చేసింది. ఈ వ్యోమనౌక బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా1ప్రధాన శాటిలైట్‌గా, మరో 18 సహ ప్రయాణికుల శాటిలైట్లతో శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఆదివారం బయలుదేర వలసి ఉంది. ఇరవై సహ ప్రయాణికుల శాటిలైట్లు ప్రయోగించడమౌతుందని ఈనెల 5న బెంగళూరు ఇస్రో తెలియచేసింది. అయితే రెండు రోజుల క్రితం భారత అంతరిక్ష అంకుర సంస్థ పిక్సెల్, సాఫ్ట్‌వేర్ సాంకేతిక సమస్యల కారణంగా తమ మొదటి శాటిలైట్ ‘ఆనంద్’ను పిఎస్‌ఎల్‌వి సి51 రాకెట్‌తో పంపడం లేదని ప్రకటించింది.గురువారం ఇస్రో తమ నానోశాటిలైట్ ఐఎన్‌ఎస్ 2డిటి కూడా సాంకేతిక సమస్యల వల్ల పంపడం లేదని వెల్లడించింది. పిఎస్‌ఎల్‌విసి51/అమెజోనియా1మిషన్ ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా సంస్థ (ఎన్‌ఎస్‌ఐఎల్)కు చెందినది.