Saturday, November 23, 2024

విరామం వీడి ఇస్రో స్పీడు

- Advertisement -
- Advertisement -

ISRO Earth satellite launch on August 12th

12న భూ శాటిలైట్ ప్రయోగం
సరికొత్త అమరికతో జిఎస్‌ఎల్‌వి రాకెట్
అరగంటకోసారి ఘాటైన చిత్రాలు

బెంగళూరు: భూమి పరిశీలన పర్యవేక్షణకు ఉద్ధేశించిన ఉపగ్రహం ఇఒఎస్ 3 ప్రతిష్టాత్మక ప్రయోగం ఈ నెల 12న జరుగుతుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ప్రయోగాన్ని తలపెట్టింది. తమ విశ్వసనీయపు వాహక నౌక జిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన ఎంకె 3 ద్వారా ఈ శాటిలైట్ కక్షలోకి వెళ్లుతుందనే విషయాన్ని నిర్థారించింది. శ్రీహరికోటలోని పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఇస్రో తలపెట్టిన పలు పరీక్షలు, ప్రయోగాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇస్రో ప్రయోగ పరిశోధనా కార్యక్రమాలలో నాలుగు నెలల విరామం ఏర్పడింది. ఆ తరువాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే అవుతుంది. ఈ నెల 12వ తేదీన భారతీయ కాలమానం ప్రకారం 0543 గంలలకు ప్రయోగం నిర్వహించాలని ఇప్పటికి తాత్కాలికంగా నిర్ణయించారు.

అయితే వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఏవైనా మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని గురువారం ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వాహక నౌక జిఎస్‌ఎల్‌వి ఎంకె 3 తన సత్తా చాటుకుంది. చంద్రయాన్ 2 మిషన్ దశలో ఈ లాంఛ్ వెహికల్ అంచనాలను మించి బాగా పనిచేసింది. స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇంధన ఆదాతో సమున్నత కక్షలో ప్రవేశపెట్టింది. దీనితో తరువాతి ప్రయోగాలకు కూడా ఇంధన అవసరం తీరే పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఈ రాకెట్ పేలోడ్ అమరికకు సంబంధించిన నాసిక భాగం రూపాన్ని మార్చారు. ఇది ఇప్పుడు బుల్లెట్ రూపంలో ఉండే 4ఎం ఒగివ్ అమరికతో ఉంటుంది. ఈ భాగంలోనే కక్షలోకి వెళ్లాల్సిన శాటిలైట్‌ను పొందుపరుస్తారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వాహక నౌకకు సంబంధించిన సామర్థాన్ని పెంచడం జరిగింది. ఇప్పటి మార్పులతో దీని ఎయిరోడైనమిక్స్ మరింత అమరికగా ఉంటుంది. ఇటువంటి పేలోడ్ ఫేరింగ్‌నే ఇకపై దేశపు అంతరిక్ష సంస్థ చేపట్టే మానవ అంతరిక్ష యానానికి కూడా వినియోగిస్తారు.

ఇంతకు ముందు జిశాట్ ఇప్పుడు ఇఒఎస్

భారత భూ పరిణామం అంతా కవర్ అయ్యేలా పరిభ్రమించే శాటిలైట్‌కు ఇంతకు ముందు జిశాట్ 1 అని వ్యవహరించే దీనిని ఇప్పుడు ఇఒఎస్ 3 శాటిలైట్‌గా పిలుస్తారు. దీని సాయంతో ప్రతి అరగంటకు ఓసారి మన భూభాగపు ఛాయాచిత్రాలను 50 మీటర్ల స్పాటియల్ రిసోల్యూషన్‌తో భూ స్థావరానికి పంపించడం జరుగుతుంది. దీనితో ఎప్పటికప్పుడు భౌగోళిక పరిణామాలను విశ్లేషించుకునేందుకు వీలేర్పడుతుంది.

ఐదు నెలల్లో 4 ఎర్త్ శాటిలైట్స్ లక్ష్యం

వచ్చే ఐదు నెలలలో నాలుగు ప్రయోగాలను చేపట్టాలని ఇస్రో సంకల్పించింది. ఇవన్నీ కూడా భూ పరిశీలనా ఉపగ్రహాలుగా ఉంటాయి. వీటిలో ఒకటి చిన్నపాటి శాటిలైట్‌తో కూడుకుని ఉంటుంది. ఇక ఇస్రో తలపెట్టిన అతి భారీ ప్రయోగాలు (బిగ్ టికెట్ మిషన్స్)కు సంబంధించి కోవిడ్ లాక్‌డౌన్ విఘ్నాలు ఏర్పడ్డాయి. వీటిలో గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా సిబ్బందిరహిత యాత్ర, చంద్రయాన్ 3 ప్రయోగం, ఇక అత్యంత ప్రతిష్టాత్మకం అయిన తొలి సౌర యాత్ర ఆదిత్య ఎల్ 1 కూడా కరోనా సంబంధిత లాక్‌డౌన్ల చిక్కులు, సకాలంలో సముచిత రీతిలో అవసరం అయిన సాంకేతిక ముడిభాగాల రాకలో జాప్యంతో వాయిదా పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News