సుప్రీం కోర్టుకు వెల్లడించిన సిబిఐ
న్యూఢిల్లీ : 1984 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో భారీ కుట్ర వెనుక విదేశీహస్తం ఉందని ఇందులో సైంటిస్టు నంబి నారాయణన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కేరళ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని సోమవారం సుప్రీం కోర్టుకు సిబిఐ వెల్లడించింది. ఈ కారణంగా క్రియోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసే సాంకేతికతకు నష్టం వాటిల్లి, స్వదేశీ అంతరిక్ష పరిశోధన కార్యక్రమం కనీసం ఒకటి రెండు దశాబ్దాల వెనక్కు పోయిందని సిబిఐ వివరించింది. ఈ కేసుకు సంబంధించి మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)తోసహా నలుగురికి కేరళ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు ధర్మాసనం అంగీకరించడాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అభ్యంతరం తెలిపింది. నవంబర్ 29 న దీనిపై విచారణ జరగనున్న సందర్బంగా జస్టిస్ ఎఎం ఖాన్ విల్కర్, సిటి రవికుమార్ ఆధ్వర్యాన దర్మాసనం ముందుకు సిబిఐ పిటిషన్ విచారణకు వచ్చింది.
ఈ కేసులోని నలుగురు నిందితులు మాజీ గుజరాత్ డిజిపి ఆర్‌బి శ్రీకుమార్, ఇద్దరు మాజీ కేరళ పోలీస్ ఆఫీసర్లు ఎస్. విజయన్, థాంపి ఎస్. దుర్గ దత్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి పి.ఎస్. జయప్రకాష్‌లకు కేరళ హైకోర్టు ఆగస్టు 13న యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఎస్.వి.రాజు ఈ విధంగా బెయిలు మంజూరు చేయడం కేసు దర్యాప్తును పక్కతోవ పట్టించ వచ్చని ధర్మాసనం ముందు వాదించారు. కొంతమంది సైంటిస్టులు విపరీతంగా వేధింపులకు గురై ఈ కేసులో ఇరుక్కున్నారని సిబిఐ గుర్తించినట్టు రాజు తెలిపారు. సైంటిస్టులను అరెస్టు చేయడంతో క్రియోజనిక్ ఇంజిన్‌కు సంబంధించిన సాంకేతిక తయారీ ఆగిపోయిందని చెప్పారు. వాస్తవానికి ఈ సాంకేతిక అభివృద్ధిలో వీరు పాలుపంచుకున్నారని వివరించారు.
ఫలితంగా మన అంతరిక్ష పరిశోధన కనీసం ఒకటి లేదా రెండు దశాబ్దాలు వెనక్కు పోయిందని తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనివెనుక విదేశీ హస్తం ఉందని అదే ఇప్పుడు దర్యాప్తు చేయడమౌతుందని చెప్పారు. అయితే ధర్మాసనం తాము నిందితుల అభ్యర్థనపై నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పగా స్టే ఉత్తర్వుల కోసం అభ్యర్థించ వచ్చునా అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్టేకు ఎక్కడ అవకాశం ఉంది, నవంబర్ 29 న విచారించడానికి నోటీసులు జారీ చేసినట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.