న్యూఢిల్లీ : “అంతరిక్ష పరిశోధన రంగంలో వైఫల్యాలన్నవి చాలా సహజం. దీనికి వ్యక్తిగతంగా ఎవరినీ ఇస్రో ఆరోపించదు. నిర్ణయాలు తీసుకోవడంలో నూతన మార్గాలను అన్వేషించాలని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుంది.” అని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ బుధవారం పేర్కొన్నారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ (ఎఐఎంఎ) 50 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
అనేకసార్లు తాను కూడా విఫలమైనప్పటికీ, తనకన్నా సీనియర్లు ఏనాడూ తనను విమర్శించలేదని గుర్తు చేశారు. ఏ నిర్ణయం ఏ ఒక్కరి వల్ల జరగదు కాబట్టి వైఫల్యాలకు ఏ ఒక్కరినీ బాధ్యులు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. ధైర్యంగా ఎవరైతే కొత్త ప్రతిపాదనలు ప్రతిపాదిస్తారో వారికి మద్దతు అందించి విశ్వాసాన్ని కల్పించాలని సూచించారు. అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో నైపుణ్యాన్ని గుర్తించడం ప్రస్తావిస్తూ అగ్రశ్రేణి సంస్థల నుంచి వచ్చే వ్యక్తులతో పోలిస్తే వినయ విధేయతల నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తుల్లోని నిబద్ధత, జీవితంలో రాణించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.