Friday, November 22, 2024

హాలో..సూర్యా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఆదిత్యా ఎల్ 1 వ్యోమనౌక శనివారం నిర్ణీత అత్యంత కీలక లగ్రాంజ్ కక్ష మజిలీకి చేరుకుంది. నూతన సంవత్సర ఆరంభ దశలోనే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ఈ ఘట్టంతో రెండవ అత్యంత ముఖ్యమైన చారిత్రక, అంతరిక్ష శాస్త్రీయ విజయం దక్కించుకుంది. సూర్యుడి బాహ్యవలయాలను , అంతర్గత పరిణామాలను పరిశీలించేందుకు ఇస్రో గత ఏడాది సెప్టెంబర్ రెండున ఆదిత్యా ఎల్ 1ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ నౌక కక్షలు దాటుకుంటూ ఇప్పుడు హాలో ఆర్బిట్ అయిన లగ్రాంజ్ పాయింట్ లేదా ఎల్ 1 గమ్యానికి చేరింది. భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోనెలకొని ఉన్న ఎటువంటి గురుత్వాకర్షణ తరంగాల ప్రభావాలు లేని స్థితి దాదాపు శూన్యస్థితిలో ఉండే హాలో కక్షలోకి వ్యోమనౌకను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలోని సాంకేతిక నిపుణులు ,సైంటిస్టుల తగు సంకేతాలు వెలువరించడం , ఇవన్నీ కూడా గురి తప్పకుండా సరిగ్గా పనిచేయడంతో అనుకున్న రీతిలో ఆదిత్యా ఎల్ 1 కోరుకున్న మజిలీకి చేరువైందని ఇస్రో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

మానవాళి ప్రయోజనాలకు ఉద్ధేశించిన ఈ ప్రయోగం , ఇప్పుడు ఈ కక్షలోకి ఆదిత్యా ఎల్ 1 చేరడంద్వారా మరింతగా విజయవంతం అయినట్లు సైంటిస్టులు స్పందించారు. చంద్రయాన్ తరువాత ఇస్రో బృందం రెట్టించిన విజయోత్సవంతో ఇప్పుడు ఈ ఆదిత్యా ఎల్ 1 మిషన్‌తో సూర్యయాన్‌కు దిగింది. ఆదిత్యా ఎల్ 1కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. సూర్యుడి అధ్యయనానికి ఇది పరిపూర్ణ స్థాయిలో పనిచేసే అంతరిక్ష నిలయ అబ్జర్వేటరిగా ఉంటుంది. ఈ తరహా ఘనత ఇస్రోకు ఇది తొలిసారి. ఇస్రో చేపట్టిన తొలి సూర్య యాత్ర ఇదేనని సైంటిస్టులు పేర్కొన్నారు. సూర్యుడు భూమి మధ్యలో వలయాకారంలో ఉండే హాలో పాయింట్ సూర్యుడి దిశలో నెలకొని ఉంటుంది. అంతరిక్షంలోని ఇటువంటి లగ్రాంజే పాయింట్ల గురించి తొలుత ఫ్రెంచ్ ఖగోళ, గణిత శాస్త్రజ్ఞులు జోసెఫ్ లూయిస్ లగ్రాంజే కనుగొన్నారు. అక్కడ భూమి సూర్యుడి భారీ స్థాయి గురుత్వాకర్షణ శక్తి దాదాపుగా తటస్థీకరణ దశలో ఉంటుందని ఈ సైంటిస్టు తమ అధ్యయనాలలో పసిగట్టారు. దీనితో ఈ క్షేత్రానికి ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు ఇక్కడి నుంచి సూర్యగోళ పరిశోధనలకు వ్యోమనౌకలు తిష్టవేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఈ కక్షలోకి వ్యోమనౌకను సరైన విధంగా ప్రవేశపెట్టడం జరిగింది.

తమ అంచనాల మేరకు ఆదిత్యా ఎల్ 1 ఇప్పుడు సరైన చోటకు చేరింది. పరిస్థితిని కొద్ది గంటల పాటు పరిశీలించడం జరుగుతుంది. తరువాత అవసరం అయిన తగు దిద్దుబాట్లు ఉంటాయి. అయితే ఇటువంటి అవసరం ఉండకపోవచ్చు అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మీడియాకు తెలిపారు. భానుడు కేవలం భారతదేశానికే కాదు , ఈ విశ్వానికి ఈ ప్రపంచానికి అంతటికీ కీలకం. ఇదే విధంగా ఆదిత్యా ఎల్ 1 కూడా సార్వత్రికం అని ఛైర్మన్ చెప్పారు. ఈ ఆదిత్యా జీవిత కాలం కనీసం ఐదేళ్లు ఉంటుంది. ఈ్యరంటీ ఉంది. త్వరలోనే శాస్త్రీయ ఫలితాలు వెలువడుతాయని వివరించారు. శూన్య స్థితిలోకి ఆదిత్యా ఎల్ 1ను పంపించడం వల్ల ఇస్రో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వివరించారు.

ఆదిత్యా పనిచేసేదిలా
సరైన కక్షలో తిష్టవేసుకుని ఉండే ఆదిత్యా ఎల్ 1 సూర్యుడి వైపు సర్వదా పరిశీలనతో గమనిస్తూ ఉంటుంది. రగిలే సూర్యుడిలోని అంతర్గత పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటుంది. సౌర విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లో విపత్కర పరిస్థితుల గురించి , భూమి, శాటిలైట్లపై ఈ తరంగాల ప్రభావం గురించి ఇస్రోకు ముందస్తు సమాచారం పంపిస్తుంది. దీనితో శాటిలైట్లను సౌర తుపాన్ల దశ నుంచి రక్షించేందుకు వీలుంటుందని ఇస్రో అధినేత సోమనాథ్ తెలిపారు. ఇది మానవాళికి అత్యంత కీలక పరిణామం అవుతుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు రూ 50,000 కోట్లకు పైగా అంతరిక్ష ఆస్తులు ఉన్నాయి. ఇందులో 50కి పైగా శాటిలైట్లు పనిచేస్తున్నాయి.

ఆదిత్యా వంటి అబ్జర్వేటరితో మనం సౌర పరిణామాలనుంచి రక్షించుకునేందుకు వీలేర్పడుతుందని ఆయన వివరించారు. ఆదిత్యా ఎల్ 1 నుంచి సూర్యుడి ఉపరితల వాతావరణ సమీకరణలు అంటే క్రోమోస్పియర్, బాహ్యవలయం కరోనా అధ్యయనం జరుగుతుంది. ప్లాస్మా పర్యావరణ పరిస్థితిని సమీక్షిస్తారు. సోలార్ కరోనా భౌతిక ధర్మాల అధ్యయనం ఉంటుంది. కరోనాలోని ఉష్ణోగ్రతలు, వేగం, సాంద్రతలపై దృష్టి సారించడం జరుగుతుంది. సూర్యుడి పొరలలో రగిలే మార్పులను పరీక్షించడానికి వీలేర్పడుతుందని ఇస్రో ఆశిస్తోంది. ప్రత్యేకించి , అన్నింటికి మించి భూమి వాతావరణంలో సూర్యరాశ్మి తలెత్తేబోయే తీవ్రస్థాయి పరిణామాలను ఆదిత్యా ఎల్ 1 ద్వారా ఎప్పటికప్పుడు గ్రహించడం ద్వారా విశ్లేషించుకునే పరిణామాలు విశ్వ మానవాళికి ఉపయుక్తకరం అవుతాయని , దీనితో ఇస్రో ఆదిత్యా ప్రయోగం , ఈ ఫలితం సార్వత్రికం అవుతుందన్నారు.

మూన్ వాక్ నుంచి సన్‌డాన్స్ వరకూ భారత్‌కు ఘనమైన మలుపు రాష్ట్రపతి , ప్రధాని స్పందన
ఇతరుల అభినందనలు
ఆదిత్యా ఎల్ 1 నిర్ణీత కక్షలోకి చేరడం పట్ల దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోడీ , భూ అంతరిక్ష వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో టీంను అభినందించారు. ఇస్రో మరో విజయం దేశ శాస్త్ర సాంకేతిక విజయాలలో మరో చరిత్రగా ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు. ఎల్ 1 విజయవంత విన్యాసం గురించి ముందుగా ఆయన ట్వీట్ పంపించారు. ఇస్రో విజయం మానవాళి అంతటికి ఉపయుక్తం అవుతుంది. ప్రత్యేకించి ఈ ప్రయోగంలో మహిళలు విశేష భూమిక వహించడం దేశ మహిళా సాధికారికతకు తిరుగులేని నిదర్శనం అని రాష్ట్రపతి ప్రకటన వెలువడింది. సూర్య భూ వ్యవస్థలపై మరింత అధ్యయనం సరికొత్త చరిత్రకు దారితీస్తుందన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సామాజిక మాధ్యమ వేదికలో మూన్‌వాక్ సన్‌డాన్స్ శీర్షికతో ఆదిత్యా ఎల్ 1 చిత్తరువు పొందుపర్చారు. వరుస విజయాల ఇస్రోకు మరోమారు అభినందనలు అని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News