Monday, December 23, 2024

ఇక గగన్‌యాన్ కీలక పరీక్షలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారతదేశ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరీక్షలను ఇస్రో చేపట్టనుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాకాలు చేపట్టారు. చంద్రయాన్ 3 తరువాత ఇస్రో ఈ గగన్‌యాన్‌ను అత్యంత ప్రధాన అంశంగా ఎంచుకుంది. స్పేస్‌లోకి మానవ రహిత ఫ్లైట్ టెస్టులను వరుసగా ఆరంభించనున్నట్లు ఈ ప్రాజెక్టు అప్‌డేట్‌లో ఇస్రో వివరించింది. ఫ్లైయిట్ టెస్ట్ సంబంధిత టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్( టివిడి1) స్టార్ట్ చేస్తున్నట్లు ఇస్రో శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపింది. టివిడి1 పరీక్షలు గగన్‌యాన్‌కు అత్యంత కీలకం. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏ విధంగా సమర్ధవంతంగా పనిచేస్తుంది? తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటీ అనేది ఈ క్రమంలో నిర్థారించుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో టివి డి1 వెహికల్ నుంచి వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్‌ను సురక్షిత ప్రాంతానికి చేర్చేందుకు ఈ టెస్టుల ప్రక్రియ అవసరం. ఈ నెల చివరి నుంచి టివి డి1 పరీక్షలు చేపడుతారని ఇంతకు ముందు అధికారులు తెలిపారు.

టెస్ట్ వెహికల్ సింగిల్ స్టేజీ లిక్విడ్ రాకెట్‌గా రూపొందుతుంది. ఇందులో రెండు పేలోడ్స్ ఉంటాయి. క్రూ మాడ్యూల్ (సిఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్స్ (ఇఇఎస్) వ్యవస్థలు అత్యంత చురుగ్గా పనిచేసే సమర్థవంతమైన మోటార్లతో ఉంటాయి. దీనితో పాటు సిఎంఎఫ్, ఇంటర్‌ఫేస్ అడాప్టర్స్ కూడా ఇమిడి ఉంటాయి. టివి డి1 ప్రయోగంలో వినియోగించే పీడన రహిత క్రూ మాడ్యూల్ చిత్రాలను ఇప్పటికే ఇస్రో విడుదల చేసింది. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురిని తొలుత ఎంచుకుని భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి తీసుకువెళ్లుతారు. రెండు మూడు రోజులు వారికి అంతరిక్షంలోనే ఉండేలా చేసి తిరిగి తీసుకువస్తారు. ముందుగా వారిని అంతరిక్ష ప్రయోగాల వేదిక అయిన శ్రీహరికోటకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో బంగళాఖాతంలో దిగేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రధాన రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌ను భారతీయ నౌకాదళం రికవరీ చేసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News