Thursday, January 23, 2025

సింగపూర్ శాటిలైట్లను కక్షలోకి పంపిన పిఎస్‌ఎల్‌వీ రాకెట్..

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: శ్రీహరికోట షార్ (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్) నుంచి శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ55 రాకెట్ విజయవంతంగా గగనతలంలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగింది. సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లి నిర్దిష్ట కక్ష లోకి ప్రవేశ పెట్టగలిగింది. 20.35 నిమిషాల ప్రయాణం తర్వాత ఉపగ్రహాలు కక్ష లోకి ప్రవేశించాయి. రెండు ఉపగ్రహాలు దాదాపు 757 కిలోల బరువు ఉన్నాయి. వీటిలో టెలియాస్ 2 , 741 కిలోలు, లూమిలైట్ 4 బరువు 16 కిలోలు . పిఎస్‌ఎల్‌వి రాకెట్ ఈ రెండు ఉపగ్రహాలను సన్ సింకనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష) లోకి ప్రవేశ పెట్టగలిగింది.

పిఎస్‌ఎల్‌వి రాకెట్ బరువు 228 టన్నులు కాగా, పొడవు 44.4 మీటర్లు. 741కిలోల బరువున్న భూ ఉపగ్రహ పరిశీలన ఉపగ్రహం టెలీయాస్ 2 సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలను తీర్చడానికి అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. మరో ఉపగ్రహం లుమిలైట్ 4 . ఇది 16 కిలోల బరువున్న అధునాతన ఉపగ్రహం. అధిక ఫ్రీక్వెన్సీ డేటా మార్పిడి వ్యవస్థను ఇందులో అమర్చారు. సింగపూర్ ఈ నావిగేషన్ సముద్ర భద్రతను పెంచడానికి, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడానికి ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు. ఈ శాటిలైట్ల తయారీకి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ సంస్థ ఆర్డరు పొందగలిగింది.

పిఒఇఎమ్ మిషన్
ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మిషన్ గురించి వివరించారు. టెలియాస్ 2 ని ఢిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డిఎస్‌టిఎ), రక్షణ, సైన్స్ కార్యకలాపాలను నిర్వహించడానికి సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ టెక్నాలజీస్ ఇంజినీరింగ్, సింగపూర్ ఏరోస్పేస్ మధ్యభాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఈ రెండు ఉపగ్రహాలను తూర్పు దిశగా ఉన్న కక్ష లోకి ప్రవేశ పెట్టారు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి)కి ఇది 57వ ప్రయోగం. ఈ పిఎస్‌ఎల్‌వి ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పిఒఇఎం)ను కూడా మోసుకెళ్లింది. ఇది పిఒఇఎంను మోసుకెళ్లే మూడో ఇస్రో మిషన్. పిఒఇఎం 2 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టి), బెల్లాట్రెక్స్ ఏరోస్పేస్ , ద్రువ స్పేస్ సంస్థలు అభివృద్ధి చేసిన ఏడు ప్రయోగాత్మక, వేరు చేయలేని పేలోడ్‌లను కలిగి ఉన్నాయి.

పిఒఇఎం 2 పేలోడ్‌లు ఎఆర్‌ఐఎస్ 25, పైలట్, ఎఆర్‌కెఎ 200, స్టార్‌బెర్రీ, డిఎస్‌ఒఎల్, డిఎస్ ఒడి3 యు, డిఎస్‌ఒడి 6యు ఈ ఏడు పేలోడ్‌లను మోసుకెళ్లే పిఒఒఎం 2 కొన్ని సమస్యల నమోదు చేయగలుగుతుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. సోలార్ ప్యానెల్‌ను ఇందులో మొదటిసారి అమలు చేయడం మరో ప్రత్యేక మైన అంశంగా పేర్కొన్నారు. పిఒఇమ్ పేలోడ్లు ఆపరేషన్ చేయడానికి శాస్త్రవేత్తలే దానికి తగిన ఇంథనం అందిస్తారని చెప్పారు. సూర్యుడికి అభిముఖంగా ఈ సోలార్ ప్యానెట్ ప్లాట్‌ఫారం పనిచేస్తుందన్నారు. తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో రాకెట్‌ను రూపొందించాలన్న లక్షంతోనే ఈ ప్రయోగాన్ని చేపట్టామన్నారు. ఈమేరకు ఉత్పత్తిని పెంపొందించి ఎక్కువ ప్రయోగాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. మిషన్ డైరెక్టర్ ఎస్‌ఆర్ రాజు అత్యంత కచ్చితత్వంతో ఈ మిషన్ పూర్తిగా వాణిజ్య ప్రయోజనాలకే అంకితమైందన్నారు. రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పర్యవేక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంతో సంబురాల్లో తేలియాడారు.

228 టన్నుల బరువు ఉన్న పిఎస్‌ఎల్‌వి 57వ సారి అంతరిక్షం లోకి దూసుకెళ్లడం విశేషం. సముద్ర భద్రత పెంచడం కోసమే లూమిలైట్‌ను సింగపూర్ ప్రవేశ పెట్టింది. లూమిలైట్ శాటిలైట్‌ను ఇన్‌ఫోకస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చి సెంటర్ అభివృద్ధి చేశాయి. ఉపగ్రహాలను నిర్ణీత కక్ష లోకి ప్రవేశ పెట్టిన తరువాత ఆరిస్2, పైలెట్, ఆర్మా 200, స్టార్ బెర్రీ, డీఎస్‌వోఎల్, డీఎస్‌వోడీ 3 యూ, డీఎస్‌వోడీ 06… అనే చిన్నపాటి పేలోడ్లను కూడా కక్ష లోకి ప్రవేశ పెట్టారు. ఈ తరహా ప్రయోగం ఇక్కడ జరగడం ఇదే తొలిసారని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇప్పటివరకు 424 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 57వ రాకెట్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News