Wednesday, January 22, 2025

మిషన్ గగన్‌యాన్‌కు ఇంజిన్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనుషులను సురక్షితంగా అంతరిక్షయాత్రకు (గగన్‌యాన్) తీసుకెళ్లడానికి అనువైన సిఇ 20 క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్టు బుధవారం సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించింది. మానవ యాత్ర సమయంలో వినియోగించే ఎల్‌వీఎం3 లాంచ్ వెహికల్ క్రయోజనిక్ దశలో దీనిని వాడనున్నారు. మానవ ప్రయాణానికి అనువైనదిగా ఈ సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ రుజువైందని, ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొందని ఇస్రో పేర్కొంది. ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే ఎల్‌విఎం 3 జి1 కు వాడే వాటి ప్రమాణ పరీక్షలు పూర్తయ్యాయని వివరించింది. రాకెట్ ఇంజిన్లలో హ్యూమన్ రేటింగ్ అనేది కీలకం. ఇది మనుషులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆ యంత్రాలు ఏమేరకు సరిపోతాయో అంచనా వేసే వ్యవస్థ.

గగన్‌యాన్‌కు సంబంధించిన వాటిని చివరిసారిగా ఫిబ్రవరి 13న ఏడోసారి పరీక్షించారు.మహేంద్ర గిరి లోని ఇస్రో లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. మొత్తం నాలుగింటిని 39 సార్లు మండించి, వాటి పనితీరును అంచనా వేశారు. ఇది దాదాపు 8810 సెకన్ల పాటు జరిగింది. వాస్తవానికి ప్రమాణాల ప్రకారం 6350 సెకన్లు నిర్వహిస్తే చాలు. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరగనున్న మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు అవసరమైన వాటికి యాక్సెప్టెన్సీ టెస్ట్‌లు కూడా పూర్తి చేసినట్టు ఇస్రో పేర్కొంది. భారత్‌కు చెందిన ముగ్గురు వ్యోమగాములను దాదాపు 400 కిమీ ఎత్తైన కక్ష లోకి చేర్చి, తిరిగి వారిని భూమి పైకి తీసుకురావాలని ఇస్రో నిర్ణయించింది. మూడు రోజుల పాటు ఈ ప్రయోగం జరగనుంది. వారు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News