Monday, December 23, 2024

ఇస్రో శాస్త్రవేత్తలు వేతనాలను పట్టించుకోరు మనసంతా ‘మిషన్’ మీదే

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇస్రో పంపించిన చంద్రయాన్3 ల్యాండర్, రోవర్‌లు అడుగుపెట్టడంతో యావత్ దేశం ఉప్పొంగిపోతోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 1లో కీలక భూమిక పోషించిన ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని నిపుణుల జీతాల్లో ఐదోవంతు మాత్రమే తీసుకునే మన శాస్త్రవేత్తలు , ఈ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతోనే ఇస్రో పరిశోధనలు చేయటంపై పీటీఐ వార్త సంస్థతో మాట్లాడిన నాయర్, ఇస్రో శాస్త్రవేత్తల్లో మిలియనీర్లు ఎవ్వరూ లేరని, వాళ్లెప్పుడూ సాధారణ జీవితాన్నే గడుపుతారన్నారు. “వాళ్లెప్పుడూ (ఇస్రో శాస్త్రవేత్తలు) డబ్బును పట్టించుకోరు. వారి ఏకాగ్రత మొత్తం మిషన్ పైనే. ఆ విధంగానే ఉన్నత శిఖరాలకు చేరుకున్నాం. పక్కా ప్రణాళిక , దూరదృష్టితోనే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఒక ప్రయోగం తరువాత మరొకటి చేసుకుంటూ వస్తున్నాం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మిషన్లను చేపడుతున్నాం.

అయినప్పటికీ 30 ఏళ్ల క్రితం పీఎస్‌ఎల్‌వీకి వినియోగించిన ఇంజిన్‌నే ఇప్పటికీ జీఎస్‌ఎల్‌వీలో కూడా వాడుతున్నాం” అని మాధవన్ నాయర్ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలకు స్వయంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికతను వాడుతున్నామని, అందుకే ఖర్చు భారీగా తగ్గుతోందని ఇస్రో మాజీ చీఫ్ నాయర్ పేర్కొన్నారు. భారత్ చేపడుతోన్న అంతరిక్ష పరిశోధనలు ఇతర దేశాల ప్రయోగాల కంటే 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చుతోనే పూర్తి చేస్తోంది. శాస్త్రవేత్తలు , టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది వేతనాలు తక్కువగా ఉండటం ఇందుకు ఓ కారణమన్నారు. ఏదేమైనా , గ్రహాల అన్వేషణ కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాల్లో చంద్రయాన్ 3 విజయంతో అవి వేగంగా ముందుకు వెళ్తాయన్నారు. తాజా ప్రయోగంతో మన సాంకేతిక సామర్థం, వ్యోమనౌక , లాంచింగ్ వ్యవస్థల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలను అందుకొన్నాయని ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News