బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కార్టోశాట్ 2 ఉపగ్రహాన్ని రోదసీలో నుంచి భారత వాతావరణంలోకి తిరిగి తీసుకువచ్చినట్లు సంస్థ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. 17 సంవత్సరాల క్రితం రెండవ తరం హై రిజల్యూషన్ ఇమేజింగ్ ఉపగ్రహాలలో ఇస్రో తొలి ఉపగ్రహం కార్టోశాట్ 2. ‘ఉపగ్రహం బుధవారం (14న) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.48 గంటలకు హిందు మహాసముద్రంపై భారత వాతావరణంలోకి ప్రవేశించింది.
అది దగ్ధమైపోయి ఉండాలి లేదా దాని శిథిలాలు సముద్రంలో పడి ఉండాల. వాటిని మనం కనుగొనలేం’ అని ఆ అధికారి వివరించారు. ఆ ఉపగ్రహాన్ని 2007 జనవరి 10న ప్రయోగించినట్లు ఇస్రో వెల్లడించింది. ప్రయోగ సమయంలో దాని బరువు 680 కిలోలు. అది 635 కిలో మీటర్ల ఎత్తులో సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌లో పని చేసింది. 2019 వరకు పట్టణ ప్రాంత ప్రణాళిక రచన కోసం అది హై రిజల్యూషన్ చిత్రాలను సమకూర్చిందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.