ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో మైలురాయిని సాధించింది. తాజాగా వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమోను విజయవంతంగా నిర్వహించింది. మహేంద్ర గిరి లోని ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని టెస్ట్ ఫెసిలిటీలో దీనిని చేపట్టినట్టు శనివారం వెల్లడించింది. వివిధ దశల్లో ఇంజిన్ రీస్టార్ట్‌ను ధ్రువీకరించుకోవడానికి ఇస్రో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇస్రో ప్రయోగ వాహక నౌకలకు లిక్విడ్ స్టేజ్‌లకు శక్తినిచ్చేదే ఈ వికాస్ ఇంజిన్. ఈ నెల 17న వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను మళ్లీ మండించినట్టు ఇస్రో పేర్కొంది.
తొలుత ఇంజిన్‌ను 60 సెకన్ల పాటు, ఆ తర్వాత 120 సెకన్ల పాటు ఆపివేసి, మళ్లీ 7 సెకన్ల పాటు మండించారు. పరీక్ష సమయంలో ఇంజిన్ లోని అన్ని పారామీటర్లు సాధారణంగా ఊహించిన విధంగానే ఉన్నాయని ఇస్రో ప్రకటించింది. ఇంజిన్ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు అదనపు పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపింది. అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహకనౌకలను మళ్లీ వినియోగించేందుకు ఇస్రో చేస్తోన్న పరీక్షల్లో ఇదో సానుకూల పరిణామం. రాకెట్‌లో ద్రవ ఇంధన దశలో వికాస్ ఇంజిన్ ఉంటుంది.