భారీ రాకెట్ ఎల్‌విఎం 3 ఎం 2 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట : దీపావళి పండగ తమకు ఓ రోజు ముందుగానే ప్రారంభమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాధ్ అన్నారు. సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి భారీ రాకెట్ ఎల్‌విఎం 3 ఎం2ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించి 36 బ్రాడ్‌బాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్షల లోకి ప్రవేశ పెట్టడంతో దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. బ్రిటన్‌కు చెందిన కస్టమర్ వన్‌వెబ్ లిమిటెడ్ కి చెందిన 36 బ్రాడ్‌బాండ్ శాటిలైట్స్‌ను ఈ భారీ రాకెట్ ఎల్‌విఎం3ఎం2 ద్వారా విజయవంతంగా కక్షల లోకి ప్రవేశ పెట్టారు. దీంతో ఇస్రో ప్రథమ వాణిజ్య కార్యకలాపాన్ని విజయవంతం చేసి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ , తమకు దీపావళి పండుగ సంబరాలు ఓ రోజు ముందుగానే ప్రారంభమయ్యాయని చెప్పారు. చంద్రయాన్3 దాదాపు సిద్ధమైందని, ఫైనల్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ దాదాపు పూర్తయ్యాయని, అయితే మరికొన్ని పరీక్షలు చేయవలసి ఉందని తెలిపారు.
కొద్దికాలం తర్వాత ఈ పరీక్షలను నిర్వహించాలని అనుకుంటున్నామని చెప్పారు. రెండు స్లాట్లు ఉన్నాయని, ఒకటి 2023 ఫిబ్రవరి లోనూ , మరొకటి 2023 జూన్ లోనూ ఉన్నట్టు తెలిపారు. చంద్రయాన్ ప్రయోగానికి 2023 జూన్‌స్లాట్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. సతీష్ ధావన్ సెంటర్ రెండో లాంచ్ పాడ్ నుంచి ప్రయోగించిన 75 నిమిషాల తరువాత దీని లోని అన్ని 36 శాటిలైట్లను నిర్దేశిత కక్షల లోకి పంపించినట్టు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అందజేసిన సహకారం వల్ల ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. చారిత్రాత్మక కార్యక్రమం కోసం అవకాశాన్ని అందిపుచ్చుకుని , నేటికి దానిని సిద్ధం చేసిన లాంచ్ వెహికిల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఎల్‌విఎం 3 ని ప్రయోగించే విషయంలో ఇస్రోపై నమ్మకం ఉంచిన వన్‌వెబ్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ఎల్‌విఎం3 మిషన్‌లో ఎన్‌ఎస్‌ఐఎస్ కాంట్రాక్ట్‌కు ఇచ్చిన మిగిలిన 36 ఉపగ్రహాలను కూడా ఇదే విధంగా విజయవంతంగా ప్రయోగించగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు.