Thursday, January 23, 2025

నింగి కక్షలోకి ఇన్సాట్ 3 డిఎస్

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : భూ, సముద్ర ఉపరితలాల అధ్యయనానికి భారతీయ అంతరిక్ష కేంద్రం (ఇస్రో)తలపెట్టిన ఉపగ్రహం ఇన్సాట్ 3డిఎస్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రోకు చెందిన విశ్వసనీయ పరిణత బాలుడు జిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా శనివారం సాయంత్రం 5.35 గంటలకు ఈ భవిష్య వాతావరణ పర్యవేక్షక శాటిలైట్‌ను నిర్ధేశిత కక్షలోకి విజయవంతంగా పంపించడంతో ఇస్రో విజయపథంలో ఈ ప్రయోగం మరో కలికితురాయి అయింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి జరిపిన ప్రయోగంతో ఇస్రో మరో విజయాన్ని కొంగున ముడివేసుకుంది. భూమి, సముద్ర ఉపరితలాల ఆటుపోట్లు, వీటి వాతావరణం అనుబంధంగా ఉంటూ విశ్వస్థాయిలో వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతాయి.

ఈ క్రమంలో ఇప్పుడు ప్రయోగించిన ఇన్సాట్ 3 డిఎస్ పరీక్ష కీలకమైంది. జిఎస్‌ఎల్‌వి రాకెట్ ఇటీవలి కాలంలో కొన్ని విఫల ప్రయోగాలను చవిచూసింది. దీనితో ఈ రాకెట్ ద్వారా అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగం తమకు సవాళ్లను ముందుంచిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. జిఎస్‌ఎల్‌వి రాకెట్ సాంకేతికతపై తలెత్తిన అనుమానాలు ఇప్పుడు ఈ పరీక్షతో తొలిగిపొయ్యాయని వివరించారు. ఇంతకు ముందు అల్లరిచిల్లరి అబ్బాయిగా ఉన్న రాకెట్ ఇప్పుడు నమ్మికల , క్రమశిక్షణాయుత బాబుగా మారాడని, మాట తప్పకుండా ముందుకు సాగాడని ఈ ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు.

ఇనుమడించిన ఆత్మస్థయిర్యం ః ఛైర్మన్
ఈ ప్రయోగం విజయవంతం కావడం తమకు ఆనందం కల్గించిందని చెప్పారు. ఇప్పటి ప్రయోగం తమకు జిఎస్‌ఎల్‌వి తరహా రాకెట్లపై మరింత నమ్మిక కల్గించాయని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. అమెరికాకు చెందిన నాసా సహకారంతో సాగే నిసార్ ప్రయోగానికి ఈ జిఎస్‌ఎల్‌విని మరింత విశ్వాసంతో వాడుకుంటామని వివరించారు. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వశాఖ నిధులతో ఈ శాటిలైట్ ప్రయోగం చేపట్టారు. ఈ శాటిలైట్ బరువు 2274 కిలోలు ఉంటుంది. జియో ఆర్బిటరీ కక్షలోకి పంపించి ప్రయోగాలు జరిపే తరువాతి తరం వాతావరణ శాటిలైట్ల క్రమంలో ఇది కీలక స్థానంలో ఉంటుంది. 2013, 2016లలో పంపించిన ఇన్సాట్ ప్రయోగాలకు ఇది కొనసాగింపుగా ఉంటుంది. ఈ ఇన్సాట్ లక్షాలు అనేకం ఉన్నాయి.

భూమి సముద్ర ఉపరితలాల అధ్యయనం, గాలింపులు, సహాయ సేవల (సార్) క్రమంలో కూడా ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. 27 .5 గంటల కౌంట్‌డౌన్ తరువాత 52 మీటర్ల పొడవైన జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 14 ద్వారా ఈ శాటిలైట్‌ను పరీక్షించారు. రాకెట్‌లో మూడంచెల అమరికలు ఉన్నాయి. నింగిలోకి దూసుకువెళ్లిన తరువాత 20 నిమిషాలకు ఉపగ్రహం అనుకున్న లక్షపు కక్షలోకి చేరుకుంది.ఈ కక్షను జియోసింక్రోనస్ మార్పిడి కక్షగా (జిటిఒ)గా వ్యవహరిస్తారు. ఈ కక్ష నుంచి ఇప్పటి శాటిలైట్ నిర్ధేశిత ప్రయోగాలను చేపడుతుంది. ఇప్పుడు నిర్ధేశిత కక్షలోకయితే చేరుకున్న శాటిలైట్‌కు ఇస్రో శాస్త్రవేత్తలు అనేక రాకల ప్రయోగవిన్యాసాలు జరిపిన తరువాత ఇది తన అధ్యయన కార్యక్రమం చేపడుతుందని ఇస్రో అధికారులు తెలిపారు.

మంచు వర్షపాతం, అగ్ని పొగమంచు పరిశీలనలు
ఇప్పుడు తలపెట్టిన శాటిలైట్‌లో పలు రకాల పేలోడ్స్ ఉంటాయి. దీని ద్వారా మబ్బుల ధర్మాలు, పొగమంచు, హిమపాతాల సాంద్రతలు వంటివాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి వీలేర్పడుతుంది. ఇది భూ సముద్ర వాతావరణాల పరిశీలనకు తోడ్పడుతుంది. ఇన్సాట్ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్‌కు పర్యాయపదంగా నిలుస్తుంది. ఈ యాత్ర విజయవంతం చేసిన వారందరికి అభినందనలు అని ఇస్రో డైరెక్టర్ తోడుగా అంతరిక్ష విభాగం కార్యదర్శి కూడా అయిన సోమనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News