Wednesday, January 22, 2025

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్1

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట: చంద్రయాన్3 విజయవంతం అయిన తరువాత సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ సీ 57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా లోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) తాజాగా ప్రయోగానికి వేదికైంది. ఇస్రో అంచనాల ప్రకారమే ప్రయోగం సాగుతోంది. ఆదిత్య ఎల్1 గమనాన్ని షార్ నుంచి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైనట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

రాకెట్ నుంచి ఆదిత్య ఎల్1 విజయవంతంగా విడిపోయిందని, దానిని కక్ష లోకి ప్రవేశ పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం చాలా ప్రత్యేకమైందని, 125 రోజుల పాటు ఈ ఉపగ్రహం ప్రయాణం చేస్తుందని, భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్1’(లగ్రాంజ్) పాయింట్‌ను చేరుకోనుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షంలో లగ్రాంజ్ పాయింట్ అనేది పార్కింగ్ ఏరియాలాంటిది. ఆదిత్య ఎల్1 ఇక్కడకు చేరుకున్న తరువాత సూర్యుడి దగ్గర జరిగే పరిణామాలను మనకు అందిస్తుంది. ఇలా సూర్యుడి చుట్టూ ఐదు లగ్రాంజ్ పాయింట్‌లు ఉన్నాయి.

అందులో ఎల్1 వద్దకు ఆదిత్య ఉపగ్రహం చేరుకుని అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరం లోని ఈ ప్రదేశం లోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫోటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు , అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.

వీటివల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షం లోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 22 సూర్య ప్రయోగాల్లో నాసా 2018లో చేసిన పార్కర్ ప్రోబ్ ప్రయోగం అత్యంత వ్యయంతో కూడుకున్నది. దానికి ఏకంగా 12 వేల కోట్లు ఖర్చు కాగా, మన ఆదిత్య ఎల్1 ప్రయోగానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. దీంతో సూర్యుడిపై అత్యంత చౌక ప్రయోగంగా ఆదిత్య ఎల్1 నిలవనున్నది.

ప్రయాణం ఇలా…
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మొదట ఆదిత్య ఎల్ 1ను భూదిగువ కక్షలో ప్రవేశ పెడుతుంది. ఆ తర్వాత దీన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్ష లోకి పంపుతారు. ఆదిత్య ఎల్1 లోని రాకెట్లను ఇందుకు ఉపయోగిస్తారు.
ఆ తర్వాత ఎల్1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభమౌతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం…ఎల్1 బిందువును చేరుకుంటుంది. ఆదిత్య ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. అందులోని ప్రధాన సాధనమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాఫ్ (వీఈఎల్‌సీ) … రోజుకు 1,440 చిత్రాలను పంపుతుంది. అంటే నిమిషానికి ఒక ఫోటో అన్నమాట. ఇది ఆదిత్య ఎల్1 లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం.. వీఈఎల్‌సీ బరువు 190 కిలోలు, అది ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇంధన వినియోగ తీరును బట్టి అది మరింత ఎక్కువ కాలం పనిచేసే అవకాశం కూడా ఉంది.

మరో ఆరు పరికరాలు…
సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇది సూర్యుడి లోని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ ప్రాంతాలను అతినీల లోహిత తరంగ దైర్ఘంలో చితీకరిస్తుంది. తద్వారా సౌర రేడియో ధార్మకతను కొలుస్తుంది. సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (సొలెక్సెస్), హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (హెచ్‌ఈ ఎల్1 ఓఎస్) ఈ రెండు సాధనాలూ సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్‌రే జ్వాలలను అధ్యయనం చేస్తాయి.  ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఆస్పెక్స్), ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పాపా)ః ఈ రెండు పరికరాలు సౌర గాలులు, ఆవేశిత అయాన్లు, వాటిలో శక్తి విస్తరణ తీరును శోధిస్తాయి.

మ్యాగ్నెటో మీటర్‌ః ఎల్1 బిందువు వద్ద గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను పరిశీలిస్తుంది.
చంద్రుడిపై చంద్రయాన్ 3 ని ల్యాండింగ్ చేసినట్టుగా ఆదిత్య ఎల్1ను కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు అందరి లోనూ నెలకొన్నాయి. అయితే గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. సూర్యుడు వాయుగోళం మాదిరిగా ఉంటాడు. దీంతో సూర్యుడి బయటి పొర కరోనా లోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్టుగానే పరిగణిస్తారు.

శనివారం నింగిలోకి పయనమైన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం … భానుడి భగభగల మాటున దాగున్న అనేక నిగూఢ అంశాల గుట్టును విప్పుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి నుంచి వెలువడే విధ్వంసకర సౌర తుపాన్లు , ప్లాస్మా, జ్వాలల విస్ఫోటాల గురించి ఈ ఉపగ్రహం మరింత అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నారు. రోదసీ లోని ఉపగ్రహాలను , వ్యోమనౌకలను, సమర్థంగా రక్షించుకోడానికి వీలు కలుగుతుందని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News