Wednesday, January 22, 2025

ఓ మనిషి భూమిని చుట్టిరా..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇటీవలి కాలంలో వరుస విజయాలతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగంలో కీలక దశ గగన్‌యాన్ వచ్చే నెల, రెండు నెలల్లో జరుగుతుంది. ఇప్పటి అంచనాల ప్రకారం అక్టోబర్‌లో ఈ పరీక్ష ఉంటుందని ఇస్రోకు కీలక అధికారి ఒకరు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. మనిషిని అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లే భారీ ప్రాజెక్టుగా గగన్‌యాన్ నిలవనుంది. దీనికి సంబంధించిన తొలి ప్రయోగం త్వరలోనే జరుగుతుందని ఇస్రో అధికారి చెప్పారు. ముందుగా దీనికి సంబంధించి క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమగ్రత దీని పనితీరును నిర్థారించుకుంటారు. తొలి ప్రయోగంలో ఇదే కీలకం అవుతుంది. గగన్‌యాన్‌కు సంబంధించి జరిగే నాలుగు నమూనాత్మక అబార్ట్ మిషన్‌ల్లో ఇది మొదటి ప్రయోగంగా ఉంటుంది.

తొలి టెస్ట్ వెహికిల్ మిషన్ టివి డి1 తరువాత వరుసగా టివి డి2 , ఆ తరువాత వరుసగా అనేక దశలలో విభిన్న ప్రయోగాలు నిర్వహిస్తారు. మనుష్యులు లేకుండా జరిగే ప్రయోగాలు, టెస్టు వెహికిల్ విజయవంతాన్ని బట్టి మనుష్యులతో కూడిన వెహికల్ ప్రయోగం జరుగుతుంది. ముందుగా క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును నిర్థారించుకోవల్సి ఉంటుందని అధికారులు వివరించారు. త్వరలోనే అంటే నెల లేదా రెండు నెలల్లోనే సంబంధిత తొలి ప్రయోగం శ్రీహరికోట నుంచి జరుగుతుందని గగన్‌యాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ హట్టన్ ఆ మధ్యలో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో తెలిపారు.

భూమి చుట్టూ ఒకటి రెండు లేదా మూడు రోజుల పరిభ్రమణం
గగన్‌యాన్ వాహక నౌక ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను భూమి చుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల వృత్తాకార కక్షలో రెండు మూడు రోజులు తిప్పి వారిని తిరిగి భూమి పైకి తీసుకువచ్చే భారతదేశ సమర్థతను చాటేందుకు ఈ గగన్‌యాన్ ప్రాజెక్టును తలపెట్టారు. భూమి చుట్టూ గగనంలో పరిభ్రమణం తరువాత వీరిని భారతీయ సముద్ర జలాల్లో ముందుగా ఖరారు చేసుకుని ఉండే నిర్ధేశిత కేంద్రంలో వీరిని సురక్షితంగా దింపుతారు. ఇస్రోకు నమ్మకమైన భారీ స్థాయి వాహక నౌక ఎల్‌విఎం 3 రాకెట్‌ను గగన్‌యాన్ మిషన్‌కు వాహక నౌకగా ఎంచుకున్నారని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి అత్యంత శక్తివంతమైన , విశ్వసనీయ పనితీరు సామర్థపు క్రయోజెనిక్ ఇంజిన్లు ఉండటం వల్ల గగన్‌యాన్ విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నారు. గగనంలో తిరిగేటప్పుడు మనిషి శరీర పరిస్థితి ,

పైన ఉండే పరిస్థితిని తట్టుకునే విధంగా ఎల్‌విఎం రాకెట్‌లో హ్యూమన్ రేటింగ్ ప్రక్రియలు ఉంటాయి. ఈ విధంగా ఈ రాకెట్‌ను హ్యుమన్ రేటెడ్ ఎల్‌విఎం (హెచ్‌ఎల్‌విఎం 3)గా వ్యవహరిస్తారని అంతర్జాతీయ స్పేస్ కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్ హట్టన్ తెలిపారు. మనుష్యుల భద్రత వారి సురక్షిత ప్రయాణానికి సంబంధించి అవసరమైన అనువైన రక్షణ చర్యలన్నింటితో ఈ రాకెట్ రూపుదిద్దుకుందని చెప్పడానికి, గగన్‌యాన్ విజయవంతం అవుతందని తెలియచేయడానికి సంతోషిస్తున్నట్లు వివరించారు. గగనంలోకి మనుష్యులను తీసుకువెళ్లే ప్రక్రియల ప్రయోగాలకు సంబంధించి అత్యంత క్లిష్టమైన పలు దశలు ఉంటాయి. ప్రత్యేకించి జరిపే ప్రయోగం ఆదిలో విఫలం అయినా, లేదా మార్గమధ్యంలో లేదా పరిభ్రమణల దశలో దెబ్బతిన్నా అత్యంత కీలక వ్యవస్థగా ఎస్కేప్ సిస్టమ్ ఉంటుంది. దీనిని గగనయాన్ ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. గగన్‌యాన్ విజయవంతం అయితే త్వరలోనే పలు దేశాలకు చెందిన ఆసక్తిగల వారిని చెల్లింపుల పద్థతిలో గగన పరిభ్రమణకు తీసుకుని వెళ్లి తిరిగి విజయవంతంగా భూమిపైకి తీసుకువచ్చే అంతర్జాతీయ స్థాయి వాణిజ్య ప్రక్రియ కోసం ఇస్రో సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News