Sunday, January 19, 2025

2040 నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగామి

- Advertisement -
- Advertisement -

లక్ష్యసాధనకు నలుగురు పైలట్లకు శిక్షణ : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

తిరువనంతపురం : చంద్రయాన్3 చారిత్రక విజయం తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి పైకి వ్యోమగామిని పంపే ప్రయత్నంలో నిమగ్నమైంది. 2040 నాటికి వ్యోమగామిని చంద్రుని పైకి పంపాలన్న లక్షంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్టు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. గగన్‌యాన్ ప్రయోగంతో అంతరిక్షరంగం లోకి తదుపరి అడుగులు వేయడానికి దూసుకు వెళ్తోంది.

ఈమేరకు భూమికి సమీపంగా ఉండే దిగువ కక్ష్యలోకి ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములను పంపడానికి సన్నాహాలు చేస్తోంది. అంతరిక్షంలో వారు మూడు రోజులు గడిపాక సురక్షితంగా భూమికి తిరిగి వస్తారని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. మనోరమ ఇయర్ బుక్ 2024లో ఈ వివరాలను ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలియజేశారు. గతవారం ఇది విడుదలైంది. ప్రస్తుతం ఈ వ్యోమగాములు గగన్‌యాన్ మిషన్ కింద బెంగళూరులో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందుతున్నారు. సోమనాథ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు సెక్రటరీగా, స్పేస్ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉంటున్నారు.

గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములను సురక్షితంగా గగనం లోకి పంపగలిగే కీలకమైన సాంకేతిక వ్యవస్థ వ్యోమనౌక (హెచ్‌ఎల్‌వి ఎం 3) లో ఉంది. ఈ ఆర్బిటల్ మోడ్యూల్‌లో క్రూ మోడ్యూల్ (సిఎం) సర్వీస్ మోడ్యూల్ (ఎస్‌ఎం) , ప్రాణాధార వ్యవస్థలు ఉన్నాయి. అయితే గగన్‌యాన్‌కు ముందు ఇస్రో ఎయిర్‌డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, వ్యోమనౌకపై ప్రయోగాలతోపాటు రెండు మానవ రహిత ప్రయోగాలు (జీ1, జీ 2) కూడా చేపడుతుంది. ఈ దిశగా ఇప్పటికే టెస్ట్ వెహికల్ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది.

అత్యవసర సమయాల్లో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకోడానికి అవసరమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్( సిఇఎస్ ) ను పరీక్షించింది. 2025 నాటికి “భారతీయ అంతరిక్ష స్టేషన్‌” ను ప్రారంభించాలని ప్రధాని మోడీ అత్యంత ప్రతిష్టాత్మక లక్షాలను నిర్దేశించారని సోమనాథ్ వివరించారు. ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత ఉనికి మరింత పటిష్టం కావడానికి వీలుగా శుక్ర, అంగారక గ్రహాలపై అన్వేషణ ప్రారంభించాలని ప్రధాని లక్షాలను నిర్దేశించారని సోమనాథ్ వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం రానున్న సంవత్సరాల్లో ఉన్నత శిఖరాలకు చేరగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News