23న కక్షలోకి 36 ఒన్‌వెబ్ శాటిలైట్స్
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలలో భారీ అడుగు వేయనుంది. ఈ 23వ తేదీన ఇస్రో భారీ వాహక నౌక ఎల్‌విఎం 3 నుంచి బ్రిటిష్ స్టార్టప్ అయిన ఒన్‌వెబ్‌కు చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ శాటిలైట్లను కక్షలోకి పంపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని స్పేస్‌పోర్టు నుంచి వీటిని ప్రయోగిస్తారు. ఇంతకు ముందు జిఎస్‌ఎల్‌వి ఎంకె 3గా వ్యవహరించిన వాహకనౌకను ఇప్పుడు ఎల్‌విఎం 3గా వ్యవహరిస్తున్నారు.
ఇస్రో అంతరిక్ష ప్రయోగాల దిశలో వాణిజ్యపరమైన కాంట్రాక్టులను దక్కించుకుంటూ , శాటిలైట్లను నిర్ధేశిత కక్షలలోకి పంపించడం భారీ స్థాయి ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు , దీని ద్వారా భవిష్య అంతరిక్ష కార్యక్రమాలకు మార్గం సుగమం చేసుకునేందుకు సంకల్పించింది. ఈ నెల 23న తెల్లవారుజామున ఎల్‌విఎం3ఎం2/ఒన్‌వెబ్ ఇండియా1 మిషన్ ను తలపెట్టినట్లు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం వర్గాలు ప్రకటించాయి. క్రియో ఇంజన్ దశలను పరిశీలించుకుంటున్నాం, ఎక్విప్‌మెంట్ బే కూర్పు పూర్తయింది. శాటిలైట్లన్నింటినీ వాహనంలోకి చేర్చడం జరిగింది. తుది దశ వాహన తనిఖీలు, తగు విధంగా పరీక్షలు నిర్వహిస్తారని ప్రకటనలో తెలిపారు.