మన తెలంగాణ/ హైదరాబాద్ : సినీ కార్మికులను వెంటనే చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కారించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్లకు సూచించారు. కరోనా కారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. బుధవారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సమస్యను రెండుమూడు రోజుల్లో పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని ఆదేశించారు. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలేనని, కరోనా సమయంలో షూటింగ్ లు లేక అనేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందేనన్నారు.
సినీ కార్మికుల రెమ్యునరేషన్ కు సంబంధించి మూడు సంవత్సరాలపాటు ఒప్పందం ఉంటుందని, కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసినందున తమ రెమ్యునరేషన్ పెంచాలని, ఇతర డిమాండ్ ల పై సినీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయాన్ని మంత్రి వివరించారు. కార్మికులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేయకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.