Wednesday, January 22, 2025

రియల్ బ్లాక్ బాక్స్ లు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంవత్సరం కాలంగా రియల్‌రంగంపై ఐటి, ఈడీ దాడులు ఎక్కువకావడంతో కరెన్సీ కట్టలు, బంగారం గుట్టలు బయటపడుతున్నాయి. రియల్‌సంస్థల్లో బ్లాక్‌మనీ అధికం కావడంతో ఐటి, ఈడీ శాఖలు దాడులను తీవ్రతరం చేశాయి. ఇన్‌కంట్యాక్స్‌ను 5 సంవత్సరాలుగా తక్కువగా చూపిస్తూ బ్లాక్‌మనీని బంగారం రూపంలో కొనుగోలు చేస్తున్న ప్రముఖ రియల్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లపై ఐటి, ఈడీ ఈ దాడులను సంవత్సర కాలంగా కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌మనీతో ప్రముఖ సంస్థలు ఫ్లాట్‌లలో నోట్ల బంకర్లను, బ్యాంక్ లాకర్లలో బంగారు బిస్కెట్ డంప్‌లను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఐటి, ఈడీ దాడుల్లో రియల్ సంస్థలు దాచిపెట్టిన కట్టలు, గుట్టలు బయటపడుతుండడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా సోమవారం సాయంత్రం సంజయ్ సోనాలికి చెందిన రుతుప్రియ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రియల్‌సంస్థకు చెందిన ఉద్యోగులు (వెంకటేశ్వర్లు, ప్రశాంత్, విపులా చౌదరిలు) రెండు కార్లలో రూ.4 కోట్ల బ్లాక్‌మనీ తరలిస్తూ పోలీసులకు పట్టుబడడం విశేషం.
ఆందోళనలో వినియోగదారులు
5 సంవత్సరాలుగా నగరం నలువైపులా అభివృద్ధి చెందడంతో ప్లాట్లు, అపార్ట్‌మెంట్ ఫ్ల్లాట్‌లు, ఇళ్లు, విల్లాలు, వ్యవసాయ భూములకు ధరలు విపరీతంగా పెరగడంతో రియల్ వ్యాపారులు వాటిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే బ్లాక్‌మనీ ఇచ్చే వినియోగదారులను ప్రోత్సహించడంతో పాటు ఆ డబ్బును వెనుకేసుకోవడంలో రియల్టర్‌లు ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఐటి, ఈడీ దాడుల్లో దొరికిన వారిలో అధికంగా తిమింగలాలే ఉండడం విశేషం. ఈ దాడులకు ముందు ఐటి, ఈడీ అధికారులు వివిధ కోణాల్లో ఆయా సంస్థల ఆస్తులు, ఆదాయం గురించి పక్కాగా ఆరా తీస్తూ ఈ దాడులను కొనసాగిస్తున్నారు.

ఈ దాడుల్లో సౌత్ ఇండియాలో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న ప్రముఖ కంపెనీలతో పాటు రాష్ట్రానికి చెందిన పలు నెంబర్‌వన్ కంపెనీలు ఉండడం గమనార్హం. సోదాలు నిర్వహించేటప్పుడు ఆ ప్రాంతంల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తును తీసుకోవడంతో పాటు మీడియాకు సైతం ఎలాంటి విషయాలు చెప్పకుండా ఐటి, ఈడీ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఫినిక్స్, సాహితీ, వంశీరాం బిల్డర్స్, శ్రీ ఆదిత్య, సిఎస్‌కె, ఊర్జిత తదితర సంస్థలపై ఈ దాడులు జరగడంతో వినియోగదారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
2022 జనవరి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని…
2022 జనవరి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ, ఈడీ సోదాలు అధికమయ్యాయి. పటాన్‌చెరులోని నవ్య డెవలపర్స్, బల్కంపేటలోని స్కందాన్షీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్, రాగమయి రియల్ సంస్థకు చెందిన కార్యాలయాలు, ఆ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు కీలక డాక్యుమెంట్‌లను, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఈ సంస్థలు ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి ఐటీ, ఈడీ అధికారులు ఆరా తీశారు.
చెల్లిస్తున్న పన్నుల్లో భారీగా తేడాలు….
ఈ కంపెనీలకు చెందిన టర్నోవర్, ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులకు భారీగా తేడాలు ఉండడంతో ఈ కంపెనీలపై అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బల్కంపేట, పటాన్‌చెరు, బీరంగూడతో పాటు ఆంధ్రలో కర్నూలు, అనంతపురం, తాడిపత్రి, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అధికారులు ఈ సోదాలు జరిపారు.
గత సంవత్సరం డిసెంబర్‌లో వంశీరాం బిల్డర్స్‌పై….
గత సంవత్సరం డిసెంబర్‌లో వంశీరాం బిల్డర్స్‌పై ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వంశీరాం కార్యాలయాలతో పాటు జూబ్లీహిల్స్‌కు చెందిన కాంట్రాక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు జరపడంతో పాటు మొత్తం 15 చోట్ల ఐటీ సోదాలు నిర్వహించి భారీ ఎత్తున నగదును ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ పరిధిలోని 50 ప్రాంతాల్లో
ఈ సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రంలో ఐటి, ఈడీ దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. శ్రీ ఆదిత్య, సిఎస్‌కె, ఊర్జిత రియల్ ఎస్టేట్ వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఆ శాఖ తనిఖీలు నిర్వహించింది. ప్లాట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ రైడ్స్ చేసినట్టుగా తెలిసింది. హైదరాబాద్ పరిధిలోని 50 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగగా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సర్లపై ఈ ఐటీ దాడులను నిర్వహించింది. ఈ సోదాలు హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరులో కూడా జరిగాయి. ఐటీ సిబ్బంది విచారణకు అకౌంట్ సిబ్బంది సహకరించపోవడం, కొన్ని కార్యాలయాల్లో దాడులకు వచ్చినప్పుడు అకౌంట్స్ సిబ్బంది కనిపించకపోవడంపై ఐటీ శాఖ అధికారులు ఆరా తీశారు. ఈ తనిఖీల్లో భాగంగా శ్రీ ఆదిత్య రియల్ ఏస్టేట్ సంస్థకు చెందిన ఆఫీసులతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు సమర్పించిన ఆదాయ పన్నుకు సంబంధించి అవకతవకలను జరిగినట్టు ఐటి శాఖ గుర్తించింది.
35 ప్రాంతాల్లో ఈ సోదాలు….
కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ సంస్థలు, భవన నిర్మాణ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే వరుసబెట్టి తనిఖీలు జరుగుతున్నాయని పలు రియల్టర్‌లు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే శ్రీ ఆదిత్య హోమ్స్‌లో నాలుగు రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగాయని, అనుమానాస్పద లావాదేవీలను అధికారులు సీజ్ చేయడంతో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, డైరెక్టర్‌ల స్టేట్‌మెంట్‌ను ఐటి శాఖ అధికారులు రికార్డ్ చేసినట్టుగా సమాచారం. తనిఖీల సందర్భంగా పలు డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు 35 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో కీలక విషయాలను అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News