శశికళకు ఐటి భారీ షాక్
రూ 100కోట్ల ఆస్తులు జప్తు
వాడుకోవచ్చు.. అమ్ముకోరాదు
2014 నాటి తీర్పుతో ఇప్పటి చర్య
న్యూఢిల్లీ/చెన్నై: బహిష్క్రత అన్నాడిఎంకె నాయకురాలు వికె శశికళకు చెందిన రూ.100కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసుకుంది. ఈ విషయాన్ని బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. దివంగత నేత జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న 1991 నుంచి 1996 మధ్యకాలంలో శశికళ 13 ఆస్తులను కొనుగోలు చేసింది. తమిళనాడులోని పయనూర్ గ్రామంలో 24 ఎకరాలలో ఈ ఆస్తులు విస్తరించుకుని ఉన్నాయి. ఈ ఆస్తులు జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ, శశికళ బంధువులు ఇలవరసి, సుధాకరన్‌కు చెందిన అక్రమాస్తులని 2014లో అప్పటి కర్నాటక ప్రత్యేక న్యాయస్థానం జడ్జి మైఖేల్ కున్హా నిర్థారించారు. వీటిని సంబంధిత జాబితాలో చేర్చారు. కొనుగోళ్ల సమయంలో ఈ ఆస్తుల విలువ రూ 20 లక్షల పలికాయి.
అయితే ఇప్పుడు ఇవి దాదాపుగా రూ 100 కోట్లుగా అంచనా వేశారు. ఆదాయపు పన్ను శాఖ సంబంధిత ఆస్తులకు సంబంధించి 2014 న్యాయస్థానం తీర్పునే ప్రాతిపదికలోకి తీసుకుంది. ఈ ఆస్తులను అక్రమ లావాదేవీల నిరోధక చట్టం పరిధిలో ఐటి తమ పరిధిలోకి అటాచ్ చేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడుకు చెందిన భూ నమోదు విభాగానికి ఇప్పటి ఆస్తుల జప్తు క్రమాన్ని తెలియచేశారు. ఆస్తుల వెలుపల అటాచ్‌మెంట్ నోటీసులు అతికించారని అధికారులు నిర్థారించారు. అయితే శశికళ ఈ ఆస్తులను సొంతంగా వాడుకోవచ్చు కానీ ఇతరత్రా ఎటువంటి లావాదేవీల అధికారం ఉండదని తెలిపారు. అవినీతి కేసులకు సంబంధించే 67 ఏండ్ల ఈ నాయకురాలు నాలుగేళ్ల జైలు శిక్షపూర్తయిన తరువాత ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల అయ్యారు.
IT Department attaches Sasikala’s assets